TOMATO PRICE: అయ్యో పాపం... టమోట రైతు

భారీగా పతనమైన టమోట ధరలు... కూలి ఖర్చులు రాక రైతన్న ఆవేదన;

Update: 2025-01-27 04:30 GMT

టమోటా రైతులకు కష్టాలు.. కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు పంటలు కోసేందుకు కూడా వెనకాడు తున్నారు. టమోటాలను తెంచడానికి కూలీలకు అయ్యే ఖర్చు కూడా తిరిగి రాదని పొలాల్లోనే పంటను వదిలేసున్నారు. ఆరుగాలం కష్టపడిన టమాటా రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు తోటలోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టించి కోయించినా గిట్టుబాటు ధర రావటంలేదని మరికొంత మంది రైతులు వాపోతున్నారు. టమోటా విక్రయాలలో పెద్ద మార్కెట్ గా పేరొందిన మదనపల్లె మార్కెట్ లో రైతులకు ప్రస్తుతం ధరలు లేక అల్లాడుతున్నారు. మూడేళ్లుగా టమాటా సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు.. ధరలు ఎప్పుడు పెరరుగుతాయో ఆశగా అని‌ ఎదురు చూస్తున్నారు.

నెల క్రితం రూ.80.. ఇప్పుడు రూ. 5

నెల క్రితం‌ టమోటా కిలో 80 రూపాయిల వరకు ధర‌ పలికింది. బయట ప్రాంతాలలో కూడా టమోటా సాగు అవుతుండటంతో మదనపల్లె మార్కెట్‌లో ధరలు పడిపోతున్నాయి. రెండు వారాలుగా నాణ్యమైన టమోట కిలో ఐదు రూపాయలు పలుకుతుండగా నాణ్యత లేని రెండో రకం టమోటా కిలో రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడింది.. ఉన్న పంటని ఎమీ చేసుకోవాలో తెలియక రైతులు అయోమయంలో పడుతున్నారు. మార్కెట్ కు టమోటా విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు కనీసం ట్రాన్స్ పోర్ట్, కూలీ ఖర్చులు కూడా రాక కన్నీటి పర్యంతం అవుతున్నారు.

పెట్టుబడే రూ. 50 వేలు

టమోట సాగు కోసం ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశామని రైతులు తెలిపారు. పిచికారి మందులు, రసాయనిక మందులు, కూలీలకు అధికంగా ఖర్చయ్యిందన్నారు. మంచిగా పంట పండిందని ఈ సారి లాభాలు వస్తాయనుకునే సమయంలో ఒక్కసారిగా మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ పంటలో కూడా నష్టాలే చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రాని పరిస్థితి నెలకొందన్నారు.

Tags:    

Similar News