తిరుమలలో నేడు ధర్మకర్తల మండలి కీలకసమావేశం

Update: 2020-11-28 04:53 GMT

తిరుమలలో నేడు ధర్మకర్తల మండలి కీలకసమావేశం జరుగనుంది. అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 సమావేశం ప్రారంభం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. జవహార్‌రెడ్డి టీడీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటిసమావేశం ఇది. అయితే ఈసమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న 17మంది ధర్మకర్తలు సమావేశంలో పాల్గొంటారు. మిగిలిన వారు వర్చువల్ ద్వారా పాల్గొంటారు. ఇందులో దర్శన టిక్కెట్ల పెంపుపై చర్చించి పాలకమండలి ఓ నిర్ణయం తీసుకోనుంది. వరహస్వామి విమాన గోపురానికి బంగారుతాపడంపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. శ్రీవారి ప‌్రసాదాలకు వినియోగించే ముడిసరుకుపై చర్చించనున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం పెరిగిన నేపథ్యంలో గరుడ వారధికి నిధుల కేటాయింపుపై చర్చించనున్నారు.

టీటీడీ పాలకమండలి సమావేశంలో కాలినడక నిర్మాణం పురోగతి, నూతన పరకామని భవనం, అదనపు పోటు నిర్మాణం పై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. వర్చువల్ సేవా టికెట్ల విడుదల వంటి వాటిపై చర్చించనున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల కారణంగా తెలంగాణకు చెందిన బోర్డు సభ్యులు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News