TTD Online Booking: 10నిమిషాలు వెయిటింగ్.. 5 నిమిషాల్లో బుకింగ్.. టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్ అసలు స్టోరీ ఇదే..!
TTD Online Booking: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్నది లక్షలాది మంది భక్తుల కల.;
TTD Online Booking (tv5news.in)
TTD Online Booking: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్నది లక్షలాది మంది భక్తుల కల. ఆ రోజు శ్రీవారిని దర్శించుకుని తరించడానికి భక్తులు ఎంతో ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. మిగిలిన రోజుల్లో రోజుకు 10వేల చొప్పున టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది.
ఇక అలా ఆన్‌లైన్ బుకింగ్ ఓపెన్ అయ్యింది లేదో.. క్షణాల్లో టికెట్లు ఖాళీ అయిపోయాయి. కేవలం 15నిమిషాల్లోనే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయి. దీంతో.. టికెట్ల కోసం కంప్యూటర్లు, మొబైల్స్‌లో టీటీడీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన లక్షలాది మంది భక్తులకు నిరాశే ఎదురైంది. శ్రీవారి దర్శనం టికెట్ల కోసం భక్తులు ఎందుకు ఇంతలా పోటీపడ్డారు.? అంత వేగంగా టికెట్లు బుక్ అయిపోవడానికి కారణం ఏంటి.?
కరోనాకు ముందు తిరుమల వీధులు లక్షలాది మంది భక్తులతో కళకళలాడేవి. రోజుకు 70వేల నుంచి లక్ష మంది వరకు శ్రీవారిని దర్శించుకునేవారు. ఇక సెలవులు, పండుగల సమయాల్లో అయితే ఆ సంఖ్య లక్ష కూడా దాటేసేది. కానీ కరోనాతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చాలా రోజులు భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యమే దక్కలేదు.
ఏటా ఒక్కసారైనా తిరుమలేశుడిని దర్శించుకునే అలవాటు చాలా మంది భక్తులకు ఉంది. ఇలాంటి వారంతా చాలా కాలంగా దర్శనం పొందలేకపోయారు. దీనికి తోడు ప్రభుత్వ మార్పు.. తద్వారా దర్శన విధానాల్లో మార్పులు రావడంతో.. చాలా మందికి దర్శనం దొరకలేదు. వీటి నేపథ్యంలోనే.. శ్రీవెంకటేశ్వరుడి దర్శన భాగ్యం ఎప్పుడా అని ఎదురుచూస్తున్న కోట్లాది భక్తులకు టీటీడీ ప్రకటన కొండంత ఆశను రేపింది.
ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని లక్షలాది మంది భక్తులు ఆన్‌లైన్‌లో ఎగబడ్డారు. భక్తుల ధాటికి సర్వర్ కూడా షేక్ అయిపోయింది. బుకింగ్ సమయంలో.. సర్వర్‌పై భారం పడినందున 10నిమిషాలు వర్చువల్‌గా వేచి ఉండాలని డిస్‌ప్లే కూడా చేశారంటే ఎంత మంది ఆన్‌లైన్‌లో క్యూ కట్టారో తెలుస్తుంది. ఇక ఆ తర్వాత బుక్కింగ్ మొదలవ్వగా కేవలం 5 నిమిషాల్లోనే టికెట్లు మొత్తం అయిపోయాయి.
10నిమిషాల వెయిటింగ్.. 5 నిమిషాల బుక్కింగ్.. మొత్తం 15నిమిషాల్లోనే బుక్కింగ్ క్లోజ్ అయిపోయింది. శ్రీవారి దర్శన టికెట్లకు ఇంత పెద్ద పోటీ రావడానికి..గత ఏడాదిన్నర కాలంగా కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం దొరకపోవడం ఒక కారణమైతే.. న్యూయర్, వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి లాంటి వరుస పండుగలు మరో కారణం. నూతన ఏడాదిలో శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుని.. కొత్త సంవత్సరం అంతా బాగుండాలని భక్తులు కోరకుంటూ ఉంటారు.
ఈ నేపథ్యంలో జనవరి మొదటి రెండు వారాలు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వైకుంఠ ఏకాదశి రద్దీ గురించి చెప్పనవసరం లేదు. ఆ వెంటనే సంక్రాంతి సెలవులు ఉండటంతో.. కుటుంబ సమేతంగా శ్రీవారికి మొక్కులు చెల్లించడానికి భక్తులు తరలివస్తారు. వీటిన్నటి నేపథ్యంలోనే టీటీడీ విడుదల చేసిన సర్వదర్శనం టికెట్లు కేవలం 5నిమిషాల్లోనే అయిపోయాయి.
టికెట్లు దక్కినవారికి చెప్పలేనంత సంతోషాన్ని.. మరోసారి దర్శన అవకాశాన్ని మిస్ అయినవారికి నిరాశను మిగిల్చాయి. ఇలాంటి వారంతా.. రేపు మరో అవకాశాన్ని పరీక్షించుకోనున్నారు. రేపు టీటీడీ జనవరి, ఫిబ్రవరి నెలలకుగానూ.. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, లఘు దర్శనం, మహాలఘుదర్శనం టికెట్లు విడుదల చేయనుంది. ఇప్పుడు భక్తుల వీటిపై ఆశలుపెట్టుకున్నారు.