TTD: గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరు గిరులు
రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం....నేటి నుంచి ఉచిత దర్శనాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30న ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మొదటి 3 రోజులు ఈ-డిప్ దర్శన టోకెన్లు కలిగిన భక్తులను అనుమతించారు. వారిని శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్ ప్రవేశ మార్గాల నుంచి టోకెన్లను స్కాన్ చేసి దర్శన క్యూలైన్లలోకి అనుమతించారు. గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం 5 గంటల వరకు 40,008 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇప్పటివరకు 1,77,337 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ-డిప్ టోకెన్లు పొందిన భక్తుల దర్శనాలు పూర్తయిన తర్వాత టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేందుకు వీలుగా అక్టోపస్ భవనం పాయింట్ నుంచి సర్వదర్శనం క్యూలైన్లోకి అనుమతిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుపతిలో రద్దీ పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు ఈనెల 8 వరకు కొనసాగుతాయి.
నేటి నుంచి ఉచిత దర్శనాలు
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్ పొందిన భక్తులు ప్రస్తుతం స్వామి దర్శించుకున్నారు. డిసెంబర్ 30 నుంచి ప్రారంభమైన ఈ దర్శనాలు కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి వారికి కేటాయించిన సమయంలో వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వరుడిని దర్శించుకుని తరించిపోతున్నారు. నేటి నుంచి టోకెన్లు లేకపోయినా భక్తులకు స్వామి వారిని దర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.
రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం
గత ఏడాది తిరుమలలో లడ్డూ ప్రసాదాలను రికార్డు స్థాయిలో విక్రయించారు. 2024తో పోలిస్తే 2025లో 10 శాతం అదనంగా భక్తులకు విక్రయించినట్లు తితిదే తెలిపింది. 2024లో 12.15 కోట్ల లడ్డూలు అమ్మగా.. 2025లో ఆ సంఖ్య 13.52 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా డిసెంబర్ 27న 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారని పేర్కొంది. ఏడాదిగా ప్రతిరోజూ 4 లక్షల వరకు లడ్డూలను తయారుచేస్తున్నట్లు తితిదే తెలిపింది. ముఖ్యమైన రోజుల్లో 8 లక్షల నుంచి 10 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. శ్రీవారి పోటులో 700 మంది సిబ్బంది రెండు షిఫ్టుల్లో శ్రమిస్తూ నియమ, నిష్టలతో ప్రసాదాలను తయారుచేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల కాలంలో లడ్డూ నాణ్యత, రుచి పెరగడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తితిదే పేర్కొంది.
శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం కుటుంబం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలకగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా బలంగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.