TURAKAPALEM: తురకపాలెంలో మరణాలపై వీడిన మిస్టరీ.?
తురకపాలెం నీటిలో యురేనియం అవశేషాలు.. చెన్నై ప్రయోగశాల నివేదికలో వెల్లడి... నీటిలో స్ట్రాన్షియం కూడా ఉన్నట్లు నిర్ధారణ..
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావడానికి, అసాధారణ మరణాలకు ప్రధాన కారణం అక్కడి నీటిలో ఉన్న యురేనియం అవశేషాలు ఉన్నట్టు అధికారులు నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో వెల్లడైంది. చెన్నై సహా పలు ల్యాబ్లు నిర్వహించిన పరీక్షల్లో ఇది తేలింది. యురేనియంతో పాటు స్ట్రానియం అనే హానికర మూలకం ఉన్నట్లు గుర్తించారు. నీరు, మట్టి, స్థానికుల బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి.. చెన్నై, ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ లకు పంపించింది. శాంపిల్స్ ను పరీక్షించిన చెన్నై ల్యాబ్స్.. గ్రామంలోని త్రాగునీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
తురకపాలెంలో భయం భయం
తురకపాలెంలో రెండు నెలల వ్యవధిలో 30 మందికి పైగా చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. జ్వరాలు వస్తున్నాయని ఆస్పత్రికి తీసుకెళ్తే మళ్లీ ఇంటికి తిరిగొచ్చే వారు తక్కువ కావడం గ్రామస్థుల భయాలను పెంచింది. చిన్న జ్వరాలకే ప్రాణాలు పోతున్నాయని, దీని వెనుక ఏదో పెద్ద కారణం ఉందని తురకపాలెం వాసులు అధికారులకు తెలిపారు. గత కొన్ని నెలలుగా గ్రామంలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ప్రాణాలు పోవడం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు.
క్వారీ గుంతల్లోని నీటి వల్లే...
గ్రామం చుట్టూ రాళ్ల క్వారీలు, వాటిలోనే పరిసర ప్రాంతాల ప్రజలు పనిచేస్తుండటంతో, క్వారీ గుంతల్లోని నీటిని వాడటం వల్లే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినట్లు అనుమానిస్తున్నారు. స్ట్రాన్షియంతో పాటు ఈకొలి అనే బ్యాక్టీరియా కూడా నీటిలో ఉన్నట్లు గుర్తించారని సమాచారం. కాగా.. యురేనియం శరీరానికి చాలా హానికరమని వైద్యులు చెప్తున్నారు. ఇది శరీరంలోకి వెళ్తే మూత్రపిండాలకు తీరని నష్టం చేస్తుందని, చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. లివర్, లంగ్స్, బ్రెయిన్, బోన్స్ డెన్సిటీని కూడా దెబ్బ తీస్తుందని చెప్తున్నారు. తురకపాలెంలో నీటిలో స్ట్రాన్షియం అనే హానికర మూలకం మరియు ఈకొలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు చెన్నై నివేదికలో తేలింది. అయితే, మొదటిసారిగా నిర్వహించిన పరీక్షల్లో మాత్రం బ్యాక్టీరియా ఒకేచోటే ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై చెన్నై నివేదిక ఫలితాలు కొంత భిన్నంగా వచ్చాయని అధికారులు తెలిపారు. యురేనియం మానవ శరీరానికి ఎంతో ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది నీరు లేదా ఆహార మార్గంలో శరీరంలోకి ప్రవేశిస్తే మొదటగా మూత్రపిండాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. కాలేయం, మెదడు, ఊపిరితిత్తులు, ఎముకలకు దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు.