90 యేళ్ల చరిత్ర ఉన్న ఉరవకొండ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ దివాలా తీసింది. మూతపడడానికి సిద్ధమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిపాజిటర్లకు ఇవ్వాల్సిన 4.2 కోట్ల రూపాయలను చెల్లించలేకపోతున్నామని బ్యాంక్ పాలకవర్గం తెలిపింది. ఇకపై బ్యాంకును నడపలేమని స్పష్టం చేసింది. ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ డిపాజిట్ రూపంలోవున్న 2.94 కోట్ల రూపాయలను వెనక్కి తెచ్చుకుని డిపాజిటర్లకు సెటిల్ చేయడం ఒక్కటే మార్గమని పాలకవర్గం తెలిపింది. అలా సెటిల్ చేయాలంటే బ్యాంక్ లైసెన్సు రద్దు చేయాలని డిపాజిటర్లందరూ తీర్మానం చేసి ఆర్‌బీఐకి పంపాల్సి ఉంటుంది. అయితే పాలకవర్గం ప్రతిపాదనను డిపాజిటర్లు ముక్తకంఠంతో తిరస్కరించారు.
బ్యాంకు పాత భవనంలో డిపాజిటర్ల ప్రత్యేక సమావేశం జరిగింది. పాలకవర్గం ప్రతిపాదనకు డిపాజిటర్లు ససేమిరా అన్నారు. సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం తెచ్చుకున్నా తమకు పూర్తి మొత్తం చెల్లించే పరిస్థితి లేదని డిపాజిటర్లు తెలిపారు. తమకు కచ్చితమైన హామీ కోసం జిల్లా అధికారులతో సమావేశం పెట్టాలని పట్టుబట్టారు. దీంతో సెప్టెంబర్ 3న ఆదివారం జిల్లా కో- ఆపరేటివ్ అధికారి సమక్షంలో సమావేశం జరపాలని తీర్మానం చేశారు. ఉరవకొండలో 1934లో కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు ఏర్పాటైంది. 2007లో బ్యాంక్ ఆర్బీఐ గుర్తింపు పొందింది. 4,700 మంది రిజిస్టర్ సభ్యులతో దాదాపు 14 కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకుంది. అయితే పాలకవర్గం నిర్వహణలోపం, బోగస్ రుణాలు, రికవరీల్లో అక్రమాలతో గత 10 యేళ్లుగా బ్యాంక్ నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే బ్యాంక్ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఫలితంగా 2021 సెప్టెంబర్ నుంచి బ్యాంక్‌లో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి.