Vasireddy Padma: మాజీ ఎంపీపై పోలీసులకు వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు.

విజ‌య‌వాడ సీపీ రాజశేఖ‌ర్‌బాబుకు ఫిర్యాదు చేసిన ప‌ద్మ;

Update: 2024-11-02 08:15 GMT

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్ చేశారు. అత్యాచారానికి గురైన బాధితుల పట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయన్నారు. మాధవ్ వ్యాఖ్యలపై విజయవాడ CPని నేడు(శనివారం) కలిసి పద్మ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్యాచార బాధితుల పట్ల గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అందరూ ఆశ్చర్యపోయేలా ఉన్నాయని అన్నారు.

ఏదైనా ఒక ఘటన జరిగిన సమయంలో అత్యాచారాలకు గురైన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామన్నారు వాసిరెడ్డి పద్మ. కానీ ఏ మాత్రం అవగాహన లేకుండా అత్యాచారానికి గురైన బాధితుల పేర్లను గోరంట్ల మాధవ్ బయటకు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనకు గురైన బాధితుల పేర్లు చెప్పి మాట్లాడటం దారుణమన్నారు. మహిళల మీద, అత్యాచార బాధితుల ఒక మాజీ ఎంపీ ఇలా అసభ్యకరంగా మాట్లాడటం సరికాదన్నారు. ఈ ఘటనకు గురైన బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకోవాలన్నారు.

ఇలాంటి వారిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నారు పద్మ. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశానని చెప్పారు. గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ వైఎస్సార్‌సీపీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేయడం, ఇప్పటికీ తొలగించకపోవడం చూస్తే.. మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న నిబద్దత ఏంటో అర్థం అవుతుందన్నారు. గోరంట్ల మాధవ్ పైన సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానన్నారు

తన రాజకీయ నిర్ణయాన్ని మరో వారం రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు వాసిరెడ్డి పద్మ. తనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయని.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) తమకు ఆప్తులు అన్నారు. త్వరలోనే ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని చెప్పారు. వాసిరెడ్డి పద్మ ఇటీవల వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో ఆమె మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా పనిచేశారు.

Tags:    

Similar News