YCP: గోరంట్ల మాధవ్ కు పోలీసుల నోటీసులు
మార్చి 5 న విచారణకు హాజరుకావాలని నోటీసులు.. అత్యాచార కేసులో బాధితురాలి పేరు వెల్లడించారని కేసు;
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు... పోలీసులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు.. అత్యాచార బాధితురాలి పేరు వెల్లడించారని నోటీసుల్లో పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాధవ్‌పై 72, 79 BNS సెక్షన్ల కింద కేసు నమోదైంది. అనంతపురంలోని గోరంట్ల మాధవ్ నివాసానికి వెళ్లిన విజయవాడ పోలీసులు మార్చి 5న విచారణకు రావాలని బీఎన్ ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేశారు. విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.
నోటిసులపై స్పందించిన గోరంట్ల
విజయవాడ పోలీసులు ఇచ్చిన నోటీసులపై వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని.. మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తోందని వెల్లడించారు. ఏపీలో మహిళలకు రక్షణే లేకుండా పోయిందన్నారు. పోలీసులు తనపై నమోదు చేసిన కేసు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత దానిపై స్పందిస్తానని గోరంట్ల వెల్లడించారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. 'కేసు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తరువాతనే మాట్లాడతాను. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే పెట్టిన కేసు ఇది. భావ ప్రకటనను ఈ ప్రభుత్వం హరిస్తోంది. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో అంతర్యుద్ధం ఏర్పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రమంతట ఓ భయానక వాతావరణం ఉంది.' అని గోరంట్ల మాధవ్ అన్నారు.
కూటమి నెక్ట్స్ టార్గెట్ గోరంట్ల?
కూటమి అధికారంలోకి వచ్చాక వివిధ కేసుల్లో YCP నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు అరెస్ట్ అవుతున్నారు. ఇటీవలే వల్లభనేని వంశీ, రెండు రోజుల క్రితం పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి నెక్ట్స్ టార్గెట్ కొడాలి నాని అని అందరూ భావించారు. కానీ, YCP మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూటమి నెక్స్ట్ టార్గెట్ అనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆయనకు ఓ కేసు విషయంలో విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు.