Vijayawada: విజయవాడ బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో జాప్యం

ఇబ్బందుల్లో ప్రజలు;

Update: 2024-05-21 03:15 GMT

విజయవాడలో ట్రాఫిక్‌ సమస్య తగ్గించేందుకు చేపట్టినపనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి. ఆరు నెలల క్రితమే 95 శాతం నిర్మాణం పూర్తయినా మిగిలిన పనులకు ఇప్పటికీ మోక్షం కలగడం లేదు. హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు మార్పు, భూ సేకరణతో ఈ పనులు ముడిపడి ఉండటంతో ముందుకు కదలడం లేదు. దీంతో విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనాదారులకు ట్రాఫిక్‌ సమస్యలు తప్పడం లేదు.

చెన్నై హౌరా జాతీయ రహదారిపై విజయవాడ నడిబొడ్డు మీదుగా రోజూ వేలాది లారీలు, ట్రక్కులు, భారీ వాహనాలుతో విపరీతమైన ట్రాఫిక్‌ సమస్య ఏర్పుడుతోంది. దీంతో సమస్యని తగ్గించేందుకు గుంటూరు జిల్లా కాజా, రాజధాని ప్రాంతం మీదుగా గొల్లపూడి నుంచి విజయవాడ శివారు చిన అవుటపల్లి వరకు బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణ పనులు దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయి. పలు అడ్డంకులతో కొన్ని పనులు నిలిచిపోవడంతో వాహనాదారులకు ట్రాఫిక్‌ సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు.

హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లు బైపాస్‌ రోడ్డుకు అత్యంత దిగువన ఉండటం వల్ల పలుచోట్ల ఆర్వోబీలు సగంలో ఆపేశారు. హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్లను ఎత్తు పెంచేటప్పుడు క్రాస్‌ అవుతున్న లైన్లను ఒకదానికొకటి అనుసంధానం కాకుండా దిశను మార్చాలి. దీనికోసం పొలాల్లో టవర్లు వేయాల్సి ఉండగా... అందుకు రైతులు ఒప్పుకోలేదు. చాలాసార్లు చర్చల తర్వాత రైతులు అంగీకరించినా.... చివరికి పరిహారంపై మళ్లీ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రైతులతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని.... జిల్లా యంత్రాంగానికి హైకోర్టు సూచించింది. ఆ తర్వాత అధికారులు రైతులు పలుమార్లు చర్చించినా ఫలితం రాలేదు. దీంతో ఆరు నెలలుగా పనులు ముందుకు సాగడం లేదు. భూసేకరణ, సాంకేతిక సమస్యలు పరిష్కరించి.... బైపాస్‌ రోడ్డును త్వరగా అందుబాటులోకి తెచ్చి..... ట్రాఫిక్‌ సమస్య నుంచి తమకి విముక్తి కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు

Tags:    

Similar News