VIVEKA: వివేకా... న్యాయం జరగదా ఇక
ఆరేళ్లుగా సాగుతోన్న వివేకా హత్య కేసు... ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయని సీబీఐ... దర్యాప్తు కీలక దశలో చేతులెత్తేసిన సీబీఐ;
“ చిన్న క్లూతో హత్యనేరం చేధించిన పోలీసులు” ఆరేళ్ల కాలంలో ఇలాంటి వార్తలు మీరు ఎన్ని చదివి ఉంటారో. కానీ అన్ని ఆధారాలు కళ్ల ముందు ఉన్నా వివేకా హత్య కేసు మాత్రం ఇంకా తేలడం లేదు. అన్ని ఆధారాలు కళ్ల ముందే ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం కేసును చేధించలేకపోయారు. వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ జగన్, భారతి వైపే చూపుతున్నా వారిని సీబీఐ ఎందుకు విచారించలేదన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. హత్య సమాచారం బయటకు రాక ముందే వారికెలా తెలుసన్న విషయంపై వారిని సీబీఐ ఒక్కసారైనా ప్రశ్నించలేదు. అవినాష్‌రెడ్డి వివేకా హత్యకు ముందు, తర్వాత వాట్సాప్‌లో ఎవరితో కాల్స్, చాట్స్ చేశారన్న విషయంపై ఎందుకు దర్యాప్తు చేయలేదో సీబీఐకే తెలియాలి. ప్రధాన కుట్రదారులెవరో వెలికితీసే స్థాయికి చేరిన దర్యాప్తును సీబీఐ కీలక దశలో ఆపేసింది. రెండేళ్లుగా అధికారులు ఈ కేసు ఊసే ఎత్తకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెండేళ్లుగా అస్సలు ఊసే లేదు
వివేకా హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని వెలికితీసే దశలో దర్యాప్తు కొనసాగించాల్సి ఉందంటూ కోర్టుల్లో చెప్పిన సీబీఐ రెండేళ్లుగా కేసు ఊసే ఎత్తట్లేదు. 2023 జూన్ 30న రెండో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశాక దర్యాప్తును నిలిపేసింది. ప్రధాన కుట్రదారులెవరో వెలికితీసే స్థాయికి దర్యాప్తును తీసుకొచ్చి అసలు అంశాల్ని ఛేదించకుండా వదిలేసింది. వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ జగన్, ఆయన సతీమణి భారతి వైపే చూపిస్తున్నా వారిని సీబీఐ ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. విచారణకు పిలుస్తూ నోటీసులైనా ఇవ్వలేదు.
సాక్ష్యుల వరుస మరణాలు
వివేకా హత్య కేసు దర్యాఫ్తు జరుగుతుండగా కీలక సాక్షులు, కేసుకు సంబంధం ఉన్న వ్యక్తులు అనుమానాస్పదరీతిలో చనిపోవడం మరో సంచలనంగా మారింది. వివేకానందరెడ్డి 2019 లో చనిపోగా అప్పటి నుంచి 2024 వరకు ఈ కేసుకు సంబంధించిన నలుగురు వ్యక్తులు వివిధ కారణాలతో చనిపోయారు. వివేకా నివాసంలో వాచ్ మన్ గా పనిచేసిన రంగన్న కూడా అనుమానాస్పదరీతిలో చనిపోయారు. రంగన్న మరణంపై ఆయన కుమారుడు కాంతారావు సందేహాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవి సహజ మరణాలేనని, అనారోగ్య కారణాలతో చనిపోయారని చెబుతున్నప్పటికీ, లోతుగా చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కేసుపై ప్రభావం చూపేవే అయినా సీబీఐ పట్టించుకోవట్లేదు. అవినాష్‌రెడ్డి ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. అత్యంత పలుకుబడి కలిగిన ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లు ఇప్పటికే సీబీఐకీ ఆధారాలతో అనేక ఫిర్యాదులు అందాయి. అయినా ఆయన ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్ వేయట్లేదు.