జగనే తెలంగాణలో కష్టమని YCPని వదిలేస్తే ఇప్పుడు కొత్త పార్టీ ఎందుకు..?
మరో ప్రస్థానం పాదయాత్ర నిర్వహించిన వైఎస్ షర్మిళ తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. త్వరలో చేవెళ్ళ నుండి మహా పాదయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు.;
మరో ప్రస్థానం పాదయాత్ర నిర్వహించిన వైఎస్ షర్మిళ తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. త్వరలో చేవెళ్ళ నుండి మహా పాదయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించిన షర్మిళ.. తండ్రి బాటలో తెలంగాణ మొత్తం చుట్టేసే ప్రణాళికను తయారు చేసుకున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే షర్మిళ తెలంగాణ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్టు చెప్తున్నారు. అయితే.. అసలు ఈ పార్టీ ప్రభావం ఎంత అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.
వాస్తవానికి.. తెలంగాణలో వైసీపీని నిలబెట్టలేక ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఆశలు వదిలేసుకున్నారు. విభజన తర్వాత 2014లో ఖమ్మంలో తప్ప ఎక్కడా వైసీపీ ప్రభావం కనిపంచలేదు. ఇక ఉన్న కొంతమంది వైఎస్సార్ మద్దతుదారులు వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ ఊసేలేదు. జగనే తెలంగాణలో కష్టమని వైసీపీని వదిలేస్తే ఇప్పుడు షర్మిళ కొత్త పార్టీ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. షర్మిళ పిలుపుతో తెలంగాణలో వైఎస్సాఆర్ మద్దుతదారులంతా కలిసి వచ్చే పరిస్థితి ఉందా..?అన్నది కూడా అనుమానమంటున్నారు.
వాస్తవానికి.. వైసీపీలో గతంలో షర్మిళ కీలక పాత్ర పోషించారు. జగనన్న వదిలిన బాణమంటూ.. పాదయాత్ర చేశారు. కానీ వైసీపీ అధికారంలో రాకముందునుంచి అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. జగన్ సీఎం అయ్యాక.. ఈ విభేదాలు తీవ్రమయినట్లు తెలుస్తోంది. తెలంగాణ YCP బాధ్యతలు షర్మిళ చూస్తారని అప్పట్లో జగన్ చెప్పారని, అయితే.. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయన్నది సమాచారం.
అసలు వైసీపీలో షర్మిళకు ఎందుకు ప్రాధాన్యత లేకుండా పోయిందినేది కూడా సస్పెన్స్‌గా మారింది. వాస్తవానికి షర్మిళను రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదన గతంలోనే ఉందని, కానీ ఆ హామీ పక్కకుపెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశాన్ని అనేక సార్లు గుర్తు చేసినా.. జగన్ పట్టించుకోలేదని అందువల్లే ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
షర్మిళ పార్టీ పేరుపై అభిమానుల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. రాజన్న రాజ్యం లేదా వైఎస్సార్ తెలంగాణ పేరుతో పార్టీని షర్మిళ ప్రకటించబోతున్నారని సమాచారం. పార్టీ ఏర్పాటులో బ్రదర్ అనిల్‌కుమార్ కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసినట్లు కూడా వైఎస్ అభిమానుల్లో చర్చ జరుగుతోంది.