WWC2025: జగజ్జేతలపై ప్రశంసల జల్లు
ఉమెన్ ఇన్ బ్లూ అద్భుతం చేసిందన్న చంద్రబాబు.. ఎందరికో స్ఫూర్తి అన్న రేవంత్
వన్డే ప్రపంచకప్ సాధించిన భారత మహిళల జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి దగ్గరి నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంల వరకూ అందరూ విశ్వవిజేతలను అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ప్రధాని మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎంలు చంద్రబాబు, రేవంత్ సహా పలువురు నేతలు ప్రశంసలు కురిపించారు. మహిళ ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. "ఫైనల్‌లో గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో ఆటగాళ్లు ప్రదర్శన చేశారు. టోర్నీ ఆసాంతం ఆటగాళ్లు అసాధారణ సమష్టి కృషి, పట్టుదలను ప్రదర్శించారు. భారత క్రీడాకారులకు అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది.” అని మోదీ ట్వీట్ చేశారు. ‘ఉమెన్ ఇన్ బ్లూ’ చరిత్ర సృష్టించిందన్న రాహుల్‌గాంధీ.. ఇది ఎంతో గర్వకారణమైన క్షణమని.. అద్భుతమైన విజయంతో కోట్లాది హృదయాలను తాకారని అన్నారు. మహిళ ప్రపంచకప్ సాధించిన క్రీడాకారులకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
భారత మహిళల జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపిన రేవంత్.. దక్షిణాఫ్రికాతో ఉద్విగ్నంగా సాగిన ఫైనల్‌లో భారత అమ్మాయిలు ఎంతో బలం, ధైర్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి టైటిల్ నెగ్గారని కొనియాడారు.సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత క్రీడాకారిణులు ప్రదర్శించిన మొక్కవోని పట్టుదల, ధైర్యసాహసాలు, అంకితభావం ప్రశంసనీయమని కొనియాడారు. జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వ పటిమను, ఫైనల్‌లో జట్టు కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. "ఈ విజయంతో దశాబ్దాల కల నెరవేరింది. భారత మహిళా జట్టు సాధించిన ఈ అద్భుతమైన ఘనతకు యావత్ దేశం గర్విస్తోంది. మన క్రీడాకారిణులు ప్రదర్శించిన పోరాట పటిమ, క్రీడాస్ఫూర్తి దేశవ్యాప్తంగా వర్ధమాన క్రికెటర్లకు గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.