గన్నవరం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో యార్లగడ్డ వెంకట్రావు భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ కు చేరుకున్న యార్లగడ్డ.. ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత నివాసానికి చేరుకున్నారు. వైసీపీకి గుడ్‌బై చెప్పిన వెంకట్రావు.. టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన ఆయన తొందరలోనే అధికారికంగా టీడీపీలో చేరబోతున్నట్లు చెప్పారు. అలాగే రేపు టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొననున్నారు. ఎల్లుండి గన్నవరం సభలో తన అనుచరులతో కలిసి లక్ష మందితో జరిగే యువగళం సభలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
యార్లగడ్డ వెంకట్రావు పార్టీలోకి రావడం శుభపరిణామన్నారు గుడివాడ టీడీపీ నేత వెనిగండ్ల రాము. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. లక్షలాది మంది కార్యకర్తలతో ఈనెల 22న గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం, గుడివాడలో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు.. కొడాలి నానిని 30 వేల ఓట్లతో ఓడిస్తానంటున్నారు.