YCP: 11 వ తేదీ.. 11 మంది ఎమ్మెల్యేలు... 11 నిమిషాల్లో వెళ్లిపోయారు
వైపీపీ నేతలపై తీరుపై భగ్గుమంటున్న ప్రజలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైసీపీ సభ్యుల తీరు మారలేదు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు. లడ్డు కల్తీ ఆరోపణలు, నిరుద్యోగ భృతి అంశం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి విషయాలపై ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ సభ్యుల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. కొందరు సభ్యులు స్పీకర్ చైర్ వైపు పేపర్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. సభలో క్రమశిక్షణ పాటించాలంటూ స్పీకర్ సూచించినప్పటికీ.. వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. అనంతరం సభను బహిష్కరిస్తూ వాకౌట్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బాయ్‌కాట్ చేస్తూ.. వాకౌట్ చేశారు.
11 మంది 11 నిమిషాలే...
ఏపీ అసెంబ్లీ లాబీలో మీడియాతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభకు హాజరై కాసేపు నిరసన తెలిపి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో స్పీకర్ స్పందిస్తూ ‘‘11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారు!.. అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా..!’’ అని వ్యాఖ్యానించారు. సభ్యులు సభా సంప్రదాయాలను పాటిస్తే మంచిదని చెప్పారు. వైసీపీ సభ్యులు కనీసం సభలో కాసేపైనా ఉండి ప్రజా సమస్యలపై ప్రశ్నలు సంధిస్తే బాగుండేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.