కాకినాడ జిల్లాలో వైసీపీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి. గొల్లప్రోలులో మార్కెట్‌ను కబ్జా చేసేందుకు కన్నేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత 50 ఏళ్లుగా ఉన్న మార్కెట్‌ను.. శ్మశాన ప్రాంతంలోకి తరలించి వ్యాపారుల పొట్ట కొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని టీడీపీ నేత వర్మ ధ్వజమెత్తారు. మార్కెట్ ప్రాంతంలో దుకాణాలు తొలగించేందుకు వచ్చిన జేసీబీని వ్యాపారులు అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. మార్కెట్ తరలిస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
మార్కెట్ వ్యాపారులకు వర్మతో పాటు గొల్లప్రోలు టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 50 ఏళ్లుగా ఎంతో మంది మార్కెట్‌పై ఆధారపడి ఉన్నారని వర్మ చెప్పారు. మార్కెట్‌ను తరలించాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మార్కెట్ స్థలంపై వైసీపీ నేతలు కన్నేశారని.. సుమారు 15 కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.