YCP: రాజ్యసభకు మరో వైసీపీ ఎంపీ గుడ్ బై..?
అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై చెప్తారన్న వార్తలు;
విజయసాయిరెడ్డితో వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. వైసీపీ తెర వెనుక రాజకీయాల్లో కీలకంగా ఉండే మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం రాజ్యసభ చైర్మన్ కు అయోధ్య రామిరెడ్డి రాజీనామా లేఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాంకీ గ్రూపునకు యజమాని అయిన అయోధ్య రామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కొన్ని కీలక జిల్లాల వైసీపీ బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు. ఆయన కూడా రాజీనామా చేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరుతారా లేకపోతే పదవికి మాత్రమే రాజీనామా చేసి వైసీపీలోనే ఉంటారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్న సమయంలో వీరు ఇలా రాజీనామాల నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. పదవి కాలం ఇంకా ఐదేళ్ల వరకూ ఉన్నా వీరు హఠాత్తుగా ఎందుకు పదవులు వదులుకుంటున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. అయోధ్య రామిరెడ్డి మాత్రం బీజేపీలో చేరుతారని అంటున్నారు. ఆయన మళ్లీ ఆ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికవుతారన్న ప్రచారం జరుగుతోంది.