YCP: బస్సు ప్రమాదంపైనా వైసీపీ దుష్ప్రచారం
మండిపడిన నారా లోకేశ్... స్పష్టత ఇచ్చిన సర్కార్
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై కొందరు పనిగట్టుకొని చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. వాస్తవాలను విస్మరిస్తూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. ‘‘బస్సు ప్రమాదం ఘటనపై సాక్షి పత్రికలో, వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెరిగి పోయాయని, బస్సు ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి తాగడం వల్లే ప్రమాదం జరిగిందని చేస్తున్న ప్రచారం అవాస్తవం. అతడు పెద్దటేకూరు గ్రామంలోని లైసెన్స్డ్ రిటైల్ మద్యం దుకాణంలో రాత్రి 7 గంటలకు ఒకసారి, రాత్రి 8.25కు మరొకసారి మద్యం కొనుగోలు చేసినట్లు సీసీకెమెరాల ఆధారంగా వెల్లడైంది. ప్రమాదం జరిగింది ’’ అని పేర్కొంది.
బ్లూ బ్యాచ్.. సమాజానికి ప్రమాదకరం: లోకేశ్
ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ పోలీసులను ఆదేశించారు. తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరంగా మారిందని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలోని ఓ గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితికి సంబంధించిన వీడియోను తాజాగా అరకులో జరిగినట్లు ఒక కథనం రాశారన్నారు. దీన్ని వైకాపా అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే వార్త, వీడియోపై రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో ‘ఫ్యాక్ట్ చెక్’లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించినట్లు చెప్పారు. అయినా మళ్లీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ నేరాలకు పాల్పడేవారిని ‘హ్యాబిట్యువల్ అఫెండర్స్’ అంటారని గుర్తుచేశారు. అందుకే అది ఒక రాజకీయ పార్టీనా ‘హ్యాబిట్యువల్ అఫెండర్స్’ ముఠానా అనే అనుమానం వస్తుందని దుయ్యబట్టారు. ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని విజ్ఙప్తి చేశారు. మరోవైపు నారా లోకేశ్ తన ఏడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించారు. నాలుగు నగరాల్లో సాగిన ఈ పర్యటన రాష్ట్రానికి ఎంతో ఫలవంతంగా సాగిందని, త్వరలోనే కీలక భాగస్వామ్యాలు కుదరనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
శివశంకర్‌పై ఎర్రిస్వామి ఫిర్యాదు
కర్నూలు ప్రమాద ఘటనలో మరణించిన బైకర్ శివశంకర్‌పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఉలిందకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే బైక్ డివైడర్‌ను ఢీకొట్టినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి పేర్కొన్నాడు. ‘‘బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరం పడిపోయాం. శివశంకర్ ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పక్కకు తీసేందుకు యత్నించా. మా బైక్‌ను ఓ వాహనం ఢీకొట్టగా రోడ్డు మధ్యలోకి వచ్చింది. అనంతరం వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను లాక్కెళ్లింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది’’ అని వివరించాడు. బైకర్, మృతుడు శివశంకర్ నుంచి సేకరించిన నమూనాల్లో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక నిర్ధరించింది.