YS Sharmila పొన్నవోలుకు హడావుడిగా మేలు చేయటంలో ఆంతర్యం ఏంటి - షర్మిల

జగన్‌ ఆదేశాల మేరకే పొన్నవోలు పిటిషన్లు

Update: 2024-04-28 05:15 GMT

నిజానికి అక్రమాస్తుల కేసులోని ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్సార్ పేరును సీబీఐ చేర్చలేదని, జగన్‌ ఆదేశాల మేరకే ఛార్జిషీట్‌లో వైఎస్‌ పేరును పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేర్చే ప్రయత్నం చేశారని స్పష్టం చేశారు. జగన్‌ ఆదేశాల మేరకే మూడు కోర్టుల్లో పొన్నవోలు పిటిషన్లు వేశారని అన్నారు. అందుకే జగన్‌ సీఎం పదవి చేపట్టిన వెంటనే హడావుడిగా పొన్నవోలుకు పదవి కట్టబెట్టారని ఆరోపించారు. ఏ సంబంధం లేకపోతే హడావుడిగా ఏఏజీ పదవిని ఎందుకు ఇచ్చారని, తండ్రి పేరును ఛార్జిషీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని ఆమె ప్రశ్నించారు.

ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. స్వామిభక్తిని ఆయన చాటుకున్నారని ఎద్దేవా చేశారు. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని అన్నారు. మహిళ అనే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలినైన నన్ను ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఇప్పుడు కొత్త దాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్‌ను వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. మద్యనిషేధం చేయకపోగా ప్రభుత్వమే విక్రయిస్తోందని అన్నారు. మెగా డీఎస్సీకి బదులు దగా డీఎస్సీ ఇచ్చారని ఆక్షేపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని, ఐదు సంక్రాంతులు వెళ్లాయని, ఒక్క జాబ్‌ క్యాలెండర్ ఇచ్చారని ప్రశ్నించారు. యువతకు ఎందుకు ఉద్యోగావకాశాలు కల్పించలేదని, ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేకపోయారని అడిగారు.

వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మాత్రం వాలంటీర్‌ పోస్టులు ఇచ్చారని గుర్తు చేశారు వాటిని ప్రభుత్వ ఉద్యోగాలుగా చెబుతారా? ఎన్నికల ముందు హడావుడిగా డీఎస్సీ ఇస్తారా? జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులను పూర్తిచేస్తామని గత మేనిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చిందని, ఒక్క ప్రాజెక్టునూ ఎందుకు పూర్తి చేయలేకపోయారని నిలదీశారు. రైతులకు ధరల స్థిరీకరణ నిధి పేరిట రూ.3వేల కోట్లు కేటాయిస్తామన్నారని, ఒక్క ఏడాదైనా కేటాయించారా? అని ప్రశ్నించారు. హామీలను తమరే నిలబెట్టుకోలేనపుడు ప్రజలు ఎలా నమ్ముతారని, వైఎస్సార్సీపీని ఎందుకు నమ్మాలని, పాత మేనిఫెస్టోలోని హామీలనే నెరవేర్చనపుడు కొత్తదానికి విలువేముంటుందని నిలదీశారు. 

Tags:    

Similar News