SHARMILA: విజయసాయి చెప్తుంటే కన్నీళ్లు వచ్చాయి: షర్మిల
ఆస్తులు కాజేసేందుకు జగన్ కుట్ర.. షర్మిల సంచలన వ్యాఖ్యలు;
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా విషయంలో విజయసాయి రెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారట. ఆయన అంగీకరించకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్లీ నాపై ఏం మాట్లాడాలో జగనే... సాయిరెడ్డికి వివరించారట. తర్వాత ప్రెస్‌మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ విజయసాయి రెడ్డి నాకు చెప్పారు. ఆయన చెప్పినవి అన్నీ విన్నాక కన్నీళ్లు వచ్చాయి’ అని షర్మిల వివరించారు. విజయసాయి రెడ్డితో చాలా విషయాలు మాట్లాడానని షర్మిల తెలిపారు. 'విజయ సాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడాను. జగన్ వల్ల పడిన ఇబ్బందుల గురించి సాయిరెడ్డి చెప్పారు. మరోవైపు నా తల్లి విజయమ్మ ఇద్దరి బిడ్డలకు న్యాయం జరగాలంటూ లేఖ రాశారు. అయితే షేర్లు తనకే చెందాలంటూ నాపై, నా తల్లిపై జగన్ కేసు వేశారు. నా మాటలు అబద్దాలని విజయ సాయిరెడ్డితో జగన్ చెప్పించారు' అని షర్మిల చెప్పుకొచ్చారు.
విజయసాయి చాలా కష్టాలు పడ్డారు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్ల చాలా కష్టాలు పడినట్లు విజయసాయిరెడ్డి తనకు చెప్పారని వైఎస్ షర్మిల తెలిపారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడటంపై స్పందించిన ఆమె.. సోదరుడు జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డితో తనపై బలవంతంగా ఆరోపణలు చేయించారని షర్మిల చెప్పారు. జగనే ప్రెస్ మీట్ పెట్టించి మరీ తనపై అబద్ధాలు చెప్పించారని ఆమె తెలిపారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాటలు అసత్యాలు అని విజయలక్ష్మి కూడా తనతో చెప్పినట్లు షర్మిల పేర్కొన్నారు. మరోసారి ప్రెస్ మీట్ పెట్టలేదని విజయసాయిరెడ్డిపై జగన్ మండిపడ్డారని, ఆయన ఒప్పుకోకపోవడంతో సుబ్బారెడ్డితో మాట్లాడించారని షర్మిల స్పష్టం చేశారు. తన క్యారెక్టర్‌పై నీచంగా మాట్లాడించారని మండిపడ్డారు. మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్ కుట్రలు చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీతో జగన్ రహస్య పొత్తు: షర్మిల
జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ బీజేపీకి వ్యతిరేకి అయినప్పటికీ, జగన్ మాత్రం బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులను జగన్ ఆరు నెలల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కానీ, జగన్‌కు విశ్వసనీయత లేదన్నారు. విశ్వసనీయ ఉంటే వాటిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.