ముస్లింల అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని లోకేష్ మండిపడ్డారు. నందికొట్కూరు నియోజకవర్గంలో రుద్రవరం మైనార్టీలు.. లోకేష్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పేద ముస్లిం కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని నాడు దుల్హన్ పథకాన్ని ప్రవేశపెట్టామని లోకేష్ తెలిపారు. కానీ తాను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్.. మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ముస్లింలను పనిగట్టుకుని వేధింపులకు గురి చేస్తోందన్నారు.
రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక కల్తీ విత్తనాల మాఫియా పేట్రేగిపోతోందన్నారు లోకేష్. వైసీపీ పాలనలో అప్పులపాలై 3వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రైతుల సగటు అప్పులో ఏపీ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్తీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.
పేదల ఇళ్లకు కేంద్రం ఇచ్చే నిధులను కూడా ఈ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని లోకేష్ ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు 98, 68 జీవోలను ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 8వేల 600 కోట్ల పంచాయతీ నిధులను ప్రభుత్వం దారిమళ్లించిందని ఆరోపించారు.