తెలంగాణలో మరో దారుణ ఘటన కలకలం రేపింది. సిద్ధిపేట జిల్లాలో కాంగ్రెస్‌కు చెందిన నాయకుడు బాల్‌రెడ్డి (50)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి వెళ్లిన బాల్‌రెడ్డి తన పనులు ముగించుకుని చెల్లాపూర్‌లోని స్వగృహానికి బైక్‌పై బయలుదేరారు. గ్రామ శివారులోకి చేరుకోగానే కొంతమంది దుండగులు అడ్డగించి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ హత్యకు రాజకీయ వైరం లేదా భూ వివాదాలే కారణమా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.