Yuvagalam : జగన్ మొద్దు నిద్రతో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది : లోకేష్
పైపులు, మట్టి పోసి.. పైన రోడ్డు వేసారే తప్ప పటిష్టమైన కాజ్‌వేలు నిర్మించలేదని లోకేష్‌కు స్థానికులు తెలిపారు. వరదలొస్తే మళ్లీ కాజ్‌వే కొట్టుకుపోవడంతో పాటు ప్రమాదం ఉంటుందన్నారు.;
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. 28వ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో యువనేత పాదయాత్ర చేపట్టారు. లోకేష్‌కు తనపల్లి గ్రామస్తులు, యువత బాణసంచా పేల్చి ఘనంగా స్వాగతం పలికారు. యువనేతకు టీడీపీ శ్రేణులు గజమాల వేసి సాదరంగా ఆహ్వానించగా.. ప్రజలు, మహిళలు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. అనంతరం అన్నివర్గాలను ఆప్యాయంగా పలకరిస్తూ.. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు లోకేష్.
తనపల్లిలో లెవల్ కాజ్‌వేని పరిశీలించిన లోకేష్.. జగన్ సర్కారుపై ఫైర్ అయ్యారు. పైపులు, మట్టి పోసి.. పైన రోడ్డు వేసారే తప్ప పటిష్టమైన కాజ్‌వేలు నిర్మించలేదని లోకేష్‌కు స్థానికులు తెలిపారు. వరదలొస్తే మళ్లీ కాజ్‌వే కొట్టుకుపోవడంతో పాటు ప్రమాదం ఉంటుందన్నారు. ప్రజల గోడు విన్న లోకేష్.. వైసీపీ అసమర్థ పాలన వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. వర్షాకాలంలో కనీస అంచనాలు లేకుండా ప్యాలెస్‌లో జగన్ మొద్దు నిద్ర పోవడంతో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందన్నారు. కాజ్‌వేలు కొట్టుకుపోయి ఏడాది అవుతున్నా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే కాజ్‌వే సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.