మంత్రి అమర్‌నాథ్‌ పేరుతో రౌడీమూకల వీరంగం

Update: 2023-06-01 09:26 GMT

విశాఖలో రౌడీమూకలు బరితెగించాయి. సింహపురి కాలనీ వద్ద వేపగుంటలోని ఓ వివాదాస్పద స్థలంలో అర్ధరాత్రి రౌడీ గ్యాంగ్ హల్‌చల్ చేశారు. లేఅవుట్‌లో జేసీబీలు, యంత్రాలతో షెడ్డును నేలమట్టం చేశారు. 50 మందికిపైగా యువకులు, పది మంది మహిళలు మంత్రి అమర్‌నాథ్‌, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ పేర్లు చెప్పి కిరాయి రౌడీలు వీరంగం సృష్టించారు. దాంతో తీవ్ర భయాందోళన గురైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన ఈ సంఘటన విశాఖలో పెను సంచలనమైంది.

వేపగుంటలోని సర్వేనంబరు 164/1లో 14.60 ఎకరాల వివాదాస్పద స్థలం ఉంది. ప్రస్తుతం మహేష్‌ అనే సివిల్‌ కాంట్రాక్టర్‌ ఆధీనంలో ఉన్న ఈ స్థలంలో షెడ్డు ఏర్పాటు చేసుకొని వాచ్‌మెన్లను పెట్టారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు భర్త లేని సమయంలో కొందరు మహిళలు తలుపు తట్టి మంచినీళ్లు కావాలని వాచ్‌మెన్ భార్యను అడిగారు. అంతే.. అలా తలుపు తీసిందో లేదో.. క్షణాల్లో ముఖాలకు చున్నీలు కట్టుకొని వచ్చిన మహిళలు.. వాచ్‌మెన్ భార్యను ఎత్తుకెళ్లి షెడ్డుకు దూరంగా తీసుకెళ్లి నిర్బంధించారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న జేసీబీలు, యంత్రాలతో షెడ్డును, ప్రహరీని కూల్చేశారు. పది మంది మహిళలు, 70 మంది మగవాళ్లు వచ్చారని వాచ్‌మెన్ భార్య అన్నారు. కనీసం తన భర్తకు ఫోన్ చేస్తానని చెప్పినా వినలేదని, సెల్‌ఫోన్ లాక్కొని చంపేస్తామంటూ బెదిరించారని ఆరోపించారు.


ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, మంత్రి అమర్‌నాథ్‌ల పేర్లు చెప్పి సునీల్‌, వినోద్‌, వీఎల్‌కే ప్రసాద్‌, సదాశివరావు బెదిరిస్తున్నారని కాంట్రాక్టర్ మహేష్‌ అన్నారు. ఈ స్థలం తమకే చెందుతుందని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని.. అయినా కావాలనే రౌడీలను పంపి దౌర్జన్యం చేస్తూ బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News