US Trade Deficit : ట్రంప్ వ్యూహం తలకిందులు.. ప్రపంచ వాణిజ్య యుద్ధంలో అమెరికాకు కోలుకోలేని దెబ్బ

Update: 2026-02-20 07:30 GMT

US Trade Deficit : అగ్రరాజ్యం అమెరికాలో విదేశీ వస్తువులపై భారీ పన్నులు వేసి, దిగుమతులు తగ్గించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. 2025లో అమెరికా వాణిజ్య లోటు ఏకంగా 901 బిలియన్ డాలర్ల వద్దే నిలిచింది. స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించి, విదేశాలపై ఆధారపడటం తగ్గించాలనే ట్రంప్ వ్యూహం పూర్తిగా సఫలం కాలేదని అమెరికా వాణిజ్య శాఖ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. 2024లో ఈ లోటు 904 బిలియన్ డాలర్లుగా ఉండగా, కఠినమైన పన్నుల తర్వాత కూడా అందులో వచ్చిన మార్పు చాలా స్వల్పమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ట్రంప్ పన్నుల దెబ్బకు చైనా నుంచి వచ్చే దిగుమతులు 32 శాతం తగ్గి, అక్కడితో వాణిజ్య లోటు 202 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే, అమెరికా తన అవసరాల కోసం చైనాను కాదని ఇతర దేశాల వైపు మళ్లింది. దీంతో తైవాన్, వియత్నాం వంటి దేశాలకు భారీగా లాభం చేకూరింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వచ్చిన విప్లవం వల్ల, అమెరికన్ టెక్ కంపెనీలు తైవాన్ నుంచి కంప్యూటర్ చిప్స్, హై-టెక్ పరికరాలను భారీగా దిగుమతి చేసుకున్నాయి. ఫలితంగా తైవాన్‌తో అమెరికా వాణిజ్య లోటు రెట్టింపై 147 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఆసియా దేశాలే కాకుండా అమెరికా పొరుగున ఉన్న మెక్సికోతో కూడా లోటు 172 బిలియన్ డాలర్ల నుండి 197 బిలియన్ డాలర్లకు పెరిగింది. వియత్నాంతో లోటులో 44 శాతం పెరుగుదల నమోదైంది. అయితే, కెనడాతో మాత్రం లోటు 26 శాతం తగ్గి 46 బిలియన్ డాలర్లకు పరిమితం కావడం విశేషం. వస్తువుల వాణిజ్యంలో దెబ్బతిన్న అమెరికాకు, సేవల రంగం మాత్రం ఊరటనిచ్చింది. బ్యాంకింగ్, టూరిజం వంటి రంగాల్లో అమెరికా 339 బిలియన్ డాలర్ల మిగులును సాధించి, తన ఆర్థిక వ్యవస్థను కొంతమేర నిలబెట్టుకుంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విదేశీ వస్తువులపై వేసే ఈ పన్నుల భారం చివరికి అమెరికా వినియోగదారుల పైనే పడుతోంది. దిగుమతి చేసుకునే కంపెనీలు ఈ పన్నులను చెల్లించి, ఆ అదనపు ఖర్చును ధరల రూపంలో సామాన్యుల నుంచి వసూలు చేస్తున్నాయి. పన్నుల అమలుకు ముందే కంపెనీలు భారీగా సరుకులను దిగుమతి చేసుకోవడంతో ఏడాది ఆరంభంలో వాణిజ్య లోటు గరిష్టంగా కనిపించింది. పన్నుల వల్ల ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు భయపడినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం అంచనా వేసిన దానికంటే కొంత తక్కువగానే ఉండటం గమనార్హం.

Tags:    

Similar News