Health Insurance : పాలసీ ఏజెంట్ల మాయమాటలు నమ్మకండి..క్లెయిమ్ టైమ్‌లో చుక్కలు చూడకూడదంటే ఇలా చేయండి.
Health Insurance : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వేదికగా ఇటీవల జరిగిన ఒక చర్చా కార్యక్రమం ఇన్వెస్టర్ల కళ్లు తెరిపించింది. సాధారణంగా అక్కడ స్టాక్ మార్కెట్ లాభాలు, సంపద సృష్టి గురించి చర్చ జరుగుతుంది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. డబ్బు సంపాదించడం కంటే, సంపాదించిన దానిని కాపాడుకోవడం ముఖ్యం అనే అంశంపై నిపుణులు ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఒకే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ మనం ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టిన సంపాదనను ఎలా ఆవిరి చేస్తుందో వివరిస్తూ.. హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న లోపాలను ఎండగట్టారు.
హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ప్రజలకు నమ్మకం పోవడానికి ప్రధాన కారణం ఎక్స్‌పెక్టేషన్ మిస్‌మ్యాచ్ అని నిపుణులు తేల్చి చెప్పారు. పాలసీ అమ్మే వ్యక్తికి, క్లెయిమ్ సెటిల్ చేసే విభాగానికి మధ్య అస్సలు పొంతన ఉండటం లేదు. ఏజెంట్లు తమ కమిషన్ కోసం అన్నీ కవర్ అయిపోతాయి అని మాయమాటలు చెబుతారు. కానీ తీరా ఆసుపత్రిలో చేరినప్పుడు రూమ్ రెంట్ దగ్గర నుంచి ప్రతి చిన్న విషయానికి కొర్రీలు వేస్తారు. అన్‌లిమిటెడ్ కవర్ అని ఆశ చూపించి, బిల్లు చెల్లించేటప్పుడు మాత్రం రకరకాల షరతులతో సగానికి పైగా క్లెయిమ్ ఎగ్గొట్టడం వల్ల సామాన్యుల్లో బీమా కంపెనీలపై విరక్తి కలుగుతోందని నిపుణుడు చోప్రా విశ్లేషించారు.
మరో నిపుణురాలు శిల్పా అరోరా మాట్లాడుతూ.. సామాన్యులు అసలు తాము ఎలాంటి పాలసీ కొంటున్నారో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రూమ్ రెంట్ క్యాప్, ట్రీట్‌మెంట్ సబ్-లిమిట్స్, కో-పేమెంట్ వంటి మెలికల వల్ల క్లెయిమ్ సొమ్ము భారీగా తగ్గిపోతోంది. పాలసీ సారాంశం కూడా సామాన్యుడికి అర్థం కాని భాషలో ఉండటం మరో శాపం. ఆసుపత్రుల్లోని టీపీఏలు కేవలం కాగితపు పనులకే పరిమితం అవుతున్నారు తప్ప, బాధితులకు సరైన సహకారం అందించడం లేదని ఆమె పేర్కొన్నారు.
మరి కేవలం పొదుపుపై ఆధారపడటం సరిపోతుందా? అంటే నిపుణుల సమాధానం.. ఖచ్చితంగా సరిపోదు. 10 లక్షల సేవింగ్స్ కంటే 10 లక్షల హెల్త్ కవర్ ఎంతో మేలు. ఎందుకంటే బీమా కవర్ ప్రతి సంవత్సరం రీసెట్ అవుతుంది, అదే సేవింగ్స్ ఒక్కసారి ఖర్చైతే మళ్ళీ వెనక్కి రావు. అందుకే మెట్రో నగరాల్లో ఉండేవారు కనీసం 10 లక్షల బేస్ పాలసీతో పాటు 25 నుంచి 50 లక్షల వరకు సూపర్ టాప్-అప్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమమని వారు సూచించారు. పాలసీ ఎంచుకునేటప్పుడు రూమ్ రెంట్ పరిమితులు లేనివి, ఆధునిక చికిత్సలు కవర్ చేసేవి. నెట్‌వర్క్ ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న కంపెనీలను ఎంచుకోవడం తెలివైన పని.