Investment : షేర్ మార్కెట్, వ్యాపారాలలో లాభాలు.. పెట్టుబడి పెట్టే ముందు ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి.
Investment : ఏదైనా వ్యాపారంలో లేదా షేర్లలో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు మంచి లాభాలు వస్తాయనే గ్యారెంటీ ఇవ్వడం కష్టం. ఆకర్షణలకు లోనై, సరైన విశ్లేషణ లేకుండా పెట్టుబడి పెడితే నష్టాలు తప్పవు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు ఆ కంపెనీ లేదా వ్యాపారం గురించి పూర్తి స్థాయిలో కాకపోయినా, కొన్ని ముఖ్యమైన ఆర్థిక అంశాలను తప్పకుండా పరిగణించాలి. మీ పెట్టుబడి సురక్షితంగా ఉండి, మంచి రాబడి పొందడానికి షేర్లు లేదా వ్యాపారాలలో డబ్బు పెట్టే ముందు ముఖ్యంగా గమనించాల్సిన 5 కీలకమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కంపెనీ మార్కెట్ రీచ్ ఎంతవరకు ఉంది?
పెట్టుబడి పెట్టడానికి ఎంచుకునే కంపెనీ లేదా వ్యాపారం, మార్కెట్‌లో ఎంత లోతుగా విస్తరించి ఉంది అనే విషయాన్ని పరిశీలించాలి. ఒక కంపెనీ ఇప్పటికే మార్కెట్‌లో పూర్తిగా విస్తరించి ఉంటే, దాని భవిష్యత్ వృద్ధి పరిమితంగా ఉండవచ్చు. అదే కంపెనీ మార్కెట్ రీచ్ ప్రస్తుతం తక్కువగా ఉండి, మరింత విస్తరించే అవకాశం ఉంటే అలాంటి కంపెనీలో పెట్టుబడి పెట్టడం వల్ల రాబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఆ కంపెనీ తన వ్యాపారాన్ని ఎంతవరకు పెంచగలదు, కొత్త ప్రాంతాలకు లేదా ఉత్పత్తులకు ఎంతవరకు వెళ్లగలదో అంచనా వేయాలి.
గత ఆదాయ వృద్ధి చరిత్ర
పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ గత కొన్ని సంవత్సరాల ఆదాయ వృద్ధి చరిత్రను తప్పకుండా పరిశీలించాలి. కంపెనీ గత 3 నుండి 5 సంవత్సరాలలో ఎంత ఆదాయ వృద్ధిని సాధించిందో చూడాలి. ఆ వృద్ధి రెండంకెల సీఏజీఆర్ లో ఉంటే, అది మంచి వృద్ధికి సంకేతం. ఒక కంపెనీ గతంలో స్థిరంగా వృద్ధిని సాధిస్తుంటే, భవిష్యత్తులో కూడా అదే పనితీరును కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
క్యాష్ ఫ్లో పై ప్రత్యేక దృష్టి
కొన్ని కంపెనీలు కాగితంపై అధిక ఆదాయాలు, లాభాలు చూపిస్తాయి. కానీ వాటి చేతిలో క్యాష్ మిగలకపోవచ్చు. అందుకే క్యాష్ ఫ్లో చాలా కీలకం. ఒక కంపెనీ తన ఆర్జించిన నికర లాభాన్ని ఎంతవరకు క్యాష్ ఫ్లోగా మార్చగలుగుతోంది అనేది గమనించాలి. చాలా లాభం వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు లేదా అప్పులు తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంటే, ఆ కంపెనీ భవిష్యత్ పెట్టుబడులకు నగదు కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కంపెనీ వద్ద పెట్టుబడులు, నిర్వహణ ఖర్చుల తర్వాత మిగిలే నగదు ఎంత ఉంది అనేది అత్యంత ముఖ్యమైన అంశం.
వినియోగం ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత
పెట్టుబడి పెట్టడానికి బిజినెస్ టు కస్టమర్ వ్యాపారాలు, బిజినెస్ టు బిజినెస్ లేదా బిజినెస్ టు గవర్నమెంట్ వ్యాపారాల కంటే మెరుగైనవిగా పరిగణిస్తారు. B2C అంటే వినియోగదారుల కొనుగోళ్లపై ఆధారపడిన వ్యాపారాలు (ఉదాహరణకు: FMCG రంగం, రిటైల్). ఈ రంగాలలో డిమాండ్ దాదాపు స్థిరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నా, ప్రజల వినియోగం కొనసాగుతుంది కాబట్టి అలాంటి రంగాలలో పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది.
పోటీతత్వం ఎంత ఉంది?
మీరు ఎంచుకున్న రంగంలో ఎంత ఎక్కువ పోటీ ఉందనేది ఆ కంపెనీ లాభాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న షేర్ ఏ పరిశ్రమకు చెందిందో గమనించండి. ఆ రంగంలో తక్కువ కంపెనీలు, తక్కువ పోటీ ఉంటే, ఆ కంపెనీ మంచి రాబడిని, లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఆ రంగంలో ఉన్న కంపెనీలు ఎంత ఆదాయం పొందుతున్నాయి. ఎంత నికర లాభం సంపాదిస్తున్నాయి అనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా ఆ రంగం పోటీ తీవ్రతను అంచనా వేయవచ్చు.