November 1 Financial Rules : పీఎన్‌బీ లాకర్ ఛార్జీలు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కొత్త ఫీజులు.. నేటి నుంచి మారిన 7 రూల్స్ ఇవే!
November 1 Financial Rules : నవంబర్ నెల ప్రారంభం కావడంతో సామాన్య ప్రజల దైనందిన ఆర్థిక కార్యకలాపాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే కీలకమైన 7 రూల్స్ మారాయి. ఆధార్ కార్డు అప్‌డేట్ ఛార్జీల నుంచి బ్యాంకింగ్ నామినేషన్ నియమాలు, కొత్త జీఎస్టీ స్లాబ్‌ల వరకు అనేక మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు పేమెంట్స్, బ్యాంక్ లాకర్ ఛార్జీలు, పింఛనుదారుల జీవన ప్రమాణ పత్రం వంటి విషయాల్లో ఈ మార్పులు వచ్చాయి.
ఆధార్ అప్‌డేట్ ఫీజులో మార్పులు
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ అప్‌డేట్‌కు సంబంధించిన ఫీజులలో మార్పులు చేసింది. 12 ఏళ్లలోపు పిల్లల ఆధార్ కార్డుల బయోమెట్రిక్ అప్‌డేట్‌కు సంబంధించిన రూ.125 ఫీజును ఒక సంవత్సరం పాటు మాఫీ చేసింది. పెద్దలకు, పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే, ఫీజుతో కూడిన అప్‌డేట్‌ల కోసం పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మార్పులకు రూ.75, బయోమెట్రిక్ (ఐరిస్, ఫింగర్ ప్రింట్) అప్‌డేట్‌కు రూ.125 ఫీజు నిర్ణయించారు.
బ్యాంక్ నామినేషన్ కొత్త నియమాలు
నవంబర్ 1 నుంచి బ్యాంక్ ఖాతాదారులకు, లాకర్ వినియోగదారులకు నామినేషన్‌కు సంబంధించిన కొత్త నియమాలు అమలులోకి వచ్చాయి. ఖాతాదారులు ఇకపై ఒకే బ్యాంక్ ఖాతా, లాకర్ లేదా సేఫ్ కస్టడీకి గరిష్టంగా నలుగురు వ్యక్తులను నామినీలుగా నామినేట్ చేసేందుకు బ్యాంకులు అనుమతిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు సులభంగా డబ్బు అందడానికి, అలాగే ఆస్తి యాజమాన్య వివాదాలను నివారించడానికి ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. నామినీలను చేర్చడం లేదా మార్చడం ప్రక్రియ కూడా సులభతరం చేశారు.
జీఎస్టీ స్లాబ్‌లలో మార్పు, లగ్జరీ పన్ను
కేంద్ర ప్రభుత్వం దేశంలో పరోక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేయడానికి జీఎస్టీ స్లాబ్‌లలో మార్పులు చేసింది. గతంలో ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబ్‌ల స్థానంలో కొన్ని వస్తువులకు ప్రత్యేక రేట్లతో కూడిన రెండు స్లాబ్ జీఎస్టీ వ్యవస్థ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. 12%, 28% స్లాబ్‌లను తొలగించారు. అయితే, పొగాకు, సిగరెట్లు వంటి లగ్జరీ, సిన్ గూడ్స్ పై 40% ప్రత్యేక లగ్జరీ ట్యాక్స్ అమలు చేస్తారు.
పింఛనుదారుల జీవన ప్రమాణ పత్రం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛను పొందే రిటైర్డ్ ఉద్యోగులు అందరూ నవంబర్ నెలాఖరులోపు తమ వార్షిక జీవన ప్రమాణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఆలస్యమైతే పింఛను నిలిచిపోవచ్చు.
ఎన్‌పీఎస్ టు యూపీఎస్ గడువు: నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ కి మారాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు.
పీఎన్‌బీ లాకర్ ఛార్జీలు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా తన లాకర్ అద్దె ఛార్జీలను సమీక్షించనుంది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్‌లో ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి.
ఎస్‌బీఐ కార్డ్ కొత్త ఫీజులు: నవంబర్ 1 నుంచి ఎస్‌బీఐ కార్డ్ వినియోగదారులు MobiKwik, CRED వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే విద్య సంబంధిత చెల్లింపులపై 1% ఫీజు చెల్లించాలి. అలాగే, డిజిటల్ వ్యాలెట్‌కు రూ.1,000 కంటే ఎక్కువ లోడ్ చేసినా 1% అదనపు ఛార్జీ పడుతుంది.