Hybrid SUVs : 35 కి.మీ మైలేజీతో 2026లో చౌక హైబ్రిడ్ ఎస్‌యూవీలు.. టాటా, హ్యుందాయ్‌లకు గట్టి పోటీ.

Update: 2025-10-18 16:30 GMT

Hybrid SUVs : భారత మార్కెట్లో హైబ్రిడ్ వాహనాలపై క్రేజ్ పెరుగుతుంది. ప్రస్తుతం టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడళ్లు అధిక ధరల కారణంగా చాలా మందికి అందుబాటులో ఉండటం లేదు. అయితే, 2026 నాటికి ఈ పరిస్థితి మారబోతోంది. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో తక్కువ ధరలో ఉండే హైబ్రిడ్ ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా మారుతి నుంచి ఫ్రాంక్స్ హైబ్రిడ్, మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ హైబ్రిడ్ మోడళ్లు రాబోతున్నాయి. కేవలం రూ.8 లక్షల ప్రారంభ ధరతో, లీటరుకు 35 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే ఈ కొత్త కార్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం టయోటా, మారుతి సుజుకి వంటి కంపెనీలు మాత్రమే హైబ్రిడ్ సెగ్మెంట్‌లో ముందున్నాయి. అయితే, ఈ మోడళ్లు అధిక ధరల కారణంగా అందరికీ అందుబాటులో లేవు. 2026 నాటికి ఈ పరిస్థితి మారబోతోంది. మారుతి సుజుకి, మహీంద్రా కంపెనీలు తమ ప్రస్తుత పాపులర్ ఎస్‌యూవీలైన ఫ్రాంక్స్, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓలో హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్

మారుతి సుజుకి తమ సరికొత్త, దేశీయంగా అభివృద్ధి చేసిన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో మార్కెట్లోకి తీసుకురాబోతున్న మొదటి మోడల్ ఫ్రాంక్స్ హైబ్రిడ్. మారుతి ఈ హైబ్రిడ్ సిస్టమ్ టయోటా అట్కిన్సన్ సైకిల్ హైబ్రిడ్ సెటప్‌ను పోలి ఉంటుంది. ప్రస్తుతం గ్రాండ్ విటారాలో దీన్ని వాడుతున్నారు. ఈ హైబ్రిడ్ సిస్టమ్‌లో కొత్తగా అభివృద్ధి చేసిన Z12E, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ జనరేటర్‌గా పనిచేస్తూ సుమారు 1.5kWh - 2kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌కు శక్తిని అందిస్తుంది. ఈ ఫ్రాంక్స్ హైబ్రిడ్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కారు లీటరుకు 35 కి.మీ వరకు మైలేజీని ఇవ్వవచ్చని అంచనా. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8 లక్షల నుండి రూ.15 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం. ఈ మోడల్‌లో సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా XUV 3XO హైబ్రిడ్

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా హైబ్రిడ్ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం..మహీంద్రా తొలి చౌక హైబ్రిడ్ ఆఫర్‌గా XUV 3XO హైబ్రిడ్ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా 2026లో మార్కెట్లోకి విడుదల కావచ్చని తెలుస్తోంది. ఈ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలో హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు 1.2 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. మహీంద్రా తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో రేంజ్ ఎక్స్‌టెండర్ కాన్ఫిగరేషన్ ను అందించాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ చౌక హైబ్రిడ్ ఎస్‌యూవీలు మార్కెట్‌లోకి వస్తే, అధిక మైలేజ్, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని కోరుకునే భారతీయ వినియోగదారులకు ఇది గొప్ప ఉపశమనం అవుతుంది.

Tags:    

Similar News