AI: గూగుల్ ఏఐ సెర్చ్‌ మోడ్ వచ్చేసింది!

గూగుల్ సెర్చ్‌కి ఏఐ పునరావిష్కరణ.. భారత్‌లో గూగుల్ ఏఐ సెర్చ్ మోడ్ లాంచ్;

Update: 2025-07-10 06:00 GMT

ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ భారత్‌ యూజర్ల కోసం ఏఐ మోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో సెర్చింగ్‌ తీరుతెన్నులనే మార్చివేయగల ఏఐ మోడ్‌.. గత సెర్చింజిన్‌కు అనుసంధానంగా పనిచేయనుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ ఫీచర్‌ను ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో అందుబాటులోకి తీసుకువచ్చారు. తర్వాత ప్రయోగాత్మక దశలో జూన్‌లో దానిని భారత్‌కు పరిచయం చేశారు. గూగుల్‌ ల్యాబ్స్‌ ద్వారా వాడుకోవాల్సి వచ్చింది. వినియోగదారుల నుంచి అందుకున్న ఫీడ్‌బ్యాక్‌, ట్రయల్స్ తర్వాత తాజాగా దేశమంతటా ఈ ఏఐ మోడ్‌ యాక్సెస్‌ను విస్తరించింది. ఈ సేవలు పొందేందుకు సెర్చ్‌ ల్యాబ్స్ ద్వారా యూజర్లు సైన్‌ అప్‌ చేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

యూజర్లకు ఈ సెర్చ్‌తో క్లిష్టమైన ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం దొరుకుతుంది. ట్రెడిషనల్ సెర్చ్‌లో ఇలాంటి ఉప ప్రశ్నల కోసం పలుమార్లు సెర్చ్‌ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు. జెమినీ 2.5 వెర్షన్‌ సాయంతో పనిచేసే దీనికి పెద్ద పెద్ద ప్రశ్నలూ సంధించొచ్చు. ఒక ప్రశ్నను అనేక ఉప ప్రశ్నలుగా విభజించి, వెబ్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ ప్రశ్నల సారాన్ని ఒక దగ్గర చేర్చి సమాధానాన్ని అందిస్తుంది. మరింత సమాచారం కోసం సంబంధిత లింక్స్‌ను కూడా అందుబాటులో ఉంచుతుంది. వస్తువులను పోల్చటం, ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకోవటం వంటి వివరణాత్మక ప్రశ్నలకు ఇది బాగా ఉపయోగపడుతుందని గూగుల్‌ చెబుతోంది.

గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌, గూగుల్ యాప్స్‌ సెర్చ్ బార్‌లో కనిపించే కొత్త ఏఐ మోడ్ ట్యాబ్ ద్వారా ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. ప్రశ్నలు టైప్‌ చేసి, వాయిస్ ఇన్‌పుట్ ఇచ్చి, గూగుల్ లెన్స్‌ ద్వారా ఇమేజ్ అప్‌లోడ్ చేసి.. ఈ మోడ్‌తో కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇంగ్లీష్ భాషలోనే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇతర భాషల్లోకి ఈ సదుపాయాన్ని తీసుకువస్తామని గూగుల్ చెప్పింది.

Tags:    

Similar News