FASTag : 18 లక్షల ఫాస్టాగ్ బాధితులు.. తప్పుడు టోల్ వసూలుపై NHAI సంచలన లెక్కలు.
FASTag : మీ కారు ఇంట్లో నిమ్మకాయలు కట్టుకుని ప్రశాంతంగా ఉంది.. కానీ మీ మొబైల్‌కు మాత్రం టోల్ ప్లాజా వద్ద డబ్బులు కట్ అయ్యాయి అని మెసేజ్ వచ్చిందా? అయితే మీరు ఒక్కరే కాదు, దేశవ్యాప్తంగా లక్షలాది మంది వాహనదారులకు ఇలాంటి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం.. 2025లో ఏకంగా 18 లక్షల కేసుల్లో తప్పుగా టోల్ వసూలు చేశారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రతి మూడు కేసుల్లో ఒకటి అసలు కారు టోల్ గేట్ దగ్గరకు వెళ్లకున్నా డబ్బులు కట్ అయినవే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో తప్పుడు టోల్ వసూళ్లకు సంబంధించి దాదాపు 18 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ తప్పులన్నింటినీ సరిదిద్ది NHAI బాధితుల సొమ్మును వెనక్కి ఇచ్చింది. అసలు కారు టోల్ ప్లాజా వద్ద లేకపోయినా డబ్బులు కట్ కావడానికి ప్రధాన కారణం మ్యాన్యువల్ ఎంట్రీ. ఏదైనా సాంకేతిక కారణంతో ఫాస్టాగ్ స్కాన్ కాకపోతే, టోల్ సిబ్బంది కారు నంబర్‌ను స్వయంగా ఎంటర్ చేస్తారు. ఆ సమయంలో ఒక్క అంకె అటు ఇటుగా కొట్టినా, ఎక్కడో మూలన ఉన్న వేరే వాహనదారుడి ఖాతా నుంచి డబ్బులు కట్ అయిపోతాయి.
ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో మాట్లాడుతూ.. ఇలాంటి పొరపాట్లను నివారించేందుకు టోల్ గేట్ల వద్ద కారు నంబర్‌ను చేత్తో నమోదు చేసే విధానాన్ని పూర్తిగా తీసివేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 464 కోట్ల ఫాస్టాగ్ లావాదేవీల్లో తప్పుడు కోతలు కేవలం 0.03 శాతం మాత్రమే అయినప్పటికీ, లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడకుండా చూడటమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఫాస్టాగ్ వల్ల టోల్ ప్లాజా వద్ద వేచి ఉండే సమయం 12 నిమిషాల నుంచి కేవలం 40 సెకన్లకు తగ్గిందని ప్రభుత్వం వెల్లడించింది.
మీ డబ్బులు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
1. SMS అలర్ట్స్ ఆన్ చేయండి: మీ ఫాస్టాగ్ ఏ బ్యాంకుకు లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ యాప్ (ICICI, HDFC, Kotak లేదా My FASTag) లోకి లాగిన్ అవ్వండి. అక్కడ నోటిఫికేషన్స్ లేదా మేనేజ్ అలర్ట్స్ సెక్షన్‌లోకి వెళ్లి SMS అలర్ట్‌లను ఆన్ చేసుకోండి. దీనివల్ల ప్రతి రూపాయి కట్ అయినప్పుడు మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. మీ మొబైల్ నంబర్ అప్‌డేట్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
2. మిస్డ్ కాల్ ద్వారా బ్యాలెన్స్ చెక్: మీ ఫాస్టాగ్ బ్యాలెన్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి +91-8884333331 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. వెంటనే మీకు బ్యాలెన్స్ వివరాలతో కూడిన మెసేజ్ వస్తుంది. ఇలా చేయడం వల్ల అనవసరంగా డబ్బులు కట్ అయితే వెంటనే గుర్తించవచ్చు.
3. ఫిర్యాదు చేయడం ఎలా?: ఒకవేళ మీ కారు ఇంట్లోనే ఉన్నప్పుడు టోల్ కట్ అయితే, వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు లేదా NHAI హెల్ప్‌లైన్ నంబర్ 1033 కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సరైన ఆధారాలు చూపిస్తే మీ డబ్బులు 15 రోజుల్లోగా మీ అకౌంట్‌కు తిరిగి వస్తాయి.