Silver in Cars: వెండి ధరల పరుగుకు కారణం నగలు కాదు..కార్లే..ఏ కారులో ఎంత వెండి ఉంటుందంటే?
Silver in Cars: వెండి అనగానే మనకు కేవలం నగలు, పూజా సామాగ్రి మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు వెండి ధరలు ఆకాశాన్ని తాకడానికి అసలు కారణం నగలు కాదు.. మనం వాడే కార్లు.. అవును నిజమే. ఆటోమొబైల్ పరిశ్రమలో వెండి వినియోగం ఊహించని రీతిలో పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా మొదలయ్యాక, వెండికి డిమాండ్ భారీగా పెరిగింది. ఒక్కో కారు తయారీలో ఎంత వెండి వాడుతున్నారో, అసలు కారులో వెండి ఎక్కడ ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కార్లలో వెండిని వాడటం అనేది వందేళ్ల నాటి ముచ్చటే అయినా, అప్పట్లో కేవలం లైట్లు, రిఫ్లెక్టర్లకే పరిమితం అయ్యేది. కానీ 2000 సంవత్సరం తర్వాత కార్లు హైటెక్ కావడంతో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. బ్రోకరేజ్ సంస్థ ఏంజెల్ వన్ నివేదిక ప్రకారం.. ఒక సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కారులో కేవలం 15-20 గ్రాముల వెండి ఉంటే, హైబ్రిడ్ కార్లలో అది 18-34 గ్రాములకు చేరుతోంది. ఇక ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే, ఏకంగా 25 నుంచి 50 గ్రాముల వెండిని వాడుతున్నారు. అంటే సాధారణ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల్లో దాదాపు 80 శాతం వరకు ఎక్కువ వెండి అవసరమవుతోంది.
అసలు కారులో వెండిని ఎక్కడ వాడుతారు? అనే సందేహం మీకు రావచ్చు. నేటి కార్లు కేవలం యంత్రాలు మాత్రమే కాదు, అవి కదిలే కంప్యూటర్లు. కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఏబీఎస్, ఎయిర్‌బ్యాగ్ సెన్సార్ల నుంచి పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ వరకు ప్రతిచోటా వెండి ఉండాల్సిందే. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఛార్జింగ్ సాకెట్లు, హై-వోల్టేజ్ కనెక్షన్లలో వెండి కీలక పాత్ర పోషిస్తుంది. వెండికి విద్యుత్తును చాలా వేగంగా, ఎలాంటి నష్టం లేకుండా ప్రసారం చేసే గుణం ఉండటమే దీనికి కారణం. అందుకే సిగ్నల్స్ త్వరగా అందడానికి కారులోని సర్క్యూట్లు, స్విచ్‌లలో వెండిని ఉపయోగిస్తారు.
ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో వెండి డిమాండ్ ఏటా 3.4 శాతం చొప్పున పెరుగుతోంది. ప్రస్తుతం ఏడాదికి 1,700 నుంచి 2,500 టన్నుల వెండిని కార్ల తయారీకే వాడుతున్నారు. రాబోయే 2031 సంవత్సరం నాటికి ఇది ఏకంగా 3,000 టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరిగే కొద్దీ, వెండి వినియోగం కూడా రెట్టింపు కానుంది. అంటే భవిష్యత్తులో వెండి ధరలను నిర్ణయించేది నగలు కాదు, మనం వాడే వాహనాలే అని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం మార్కెట్లో వెండి ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు భారీగా పెరగడం, మరుసటి రోజే పడిపోవడం వెనుక ఈ పారిశ్రామిక డిమాండ్ కీలక పాత్ర పోషిస్తోంది. మొబైల్ ఫోన్లు, సోలార్ ప్లేట్లు మరియు కార్ల తయారీలో వెండి వాడకం పెరగడంతో, దీన్ని కేవలం ఒక లోహంలా కాకుండా ఒక వ్యూహాత్మక వనరుగా కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే వెండి ధరలు భారీగా తగ్గినా, లాంగ్ టర్మ్ లో మాత్రం ఇవి మళ్లీ పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.