వేగంగా ఎదుగుతోన్న యాపిల్.. కారణం ఏంటంటే?
టిమ్‌కుక్ బాధ్యతలు స్వీకరించే నాటికి యాపిల్ మార్కెట్ క్యాప్ 360 బిలియన్ డాలర్లు.. ప్రస్తుతం ఏడు రెట్లు పెరిగింది.;
సంస్థ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్‌కు తగ్గ వారసుడిగా తన సత్తా ఏంటో చూపిస్తున్నారు యాపిల్ సీఈఓ టిమ్ కుక్. 2011 స్టీవ్ జాబ్స్ మరణాంతరం యాపిల్ సీఈఓగా పగ్గాలు చేపట్టిన టిమ్‌కుక్, గత తొమ్మిదేళ్ళుగా సంస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. 2011లో టిమ్‌కుక్ బాధ్యతలు స్వీకరించే నాటికి యాపిల్ మార్కెట్ క్యాప్ 360 బిలియన్ డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది ఏడు రెట్లు పెరిగింది. 2.15 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న తొలి అమెరికా కంపెనీగా యాపిల్ రికార్డు క్రియేట్ చేసింది. UK బెంచ్ మార్క్ ఇండెక్స్ FTSC 100 మొత్తం మార్కెట్ క్యాప్‌కు సమానంగా ఆపిల్ మార్కెట్ క్యాప్ ఉంది.
ఈనెల 24తో యాపిల్ సీఈఓగా తొమ్మిది సంవత్సరాలను పూర్తిచేసుకున్నారు టిమ్‌కుక్. ఈ సందర్భంగా కంపెనీ షేర్ విభజనపై ప్రకటన చేసింది. టిమ్ కుక్ సీఈఓగా పదవిని చేపట్టిన తర్వాత షేర్లను విభజించడం ఇది రెండోసారి. 1:4 నిష్పత్తిలో షేర్లను విభజింపు నిర్ణయం కంపెనీ షేరుపై ఎలాంటి ప్రభావం పడనప్పటికీ... వాటాదార్లలో మాత్రం ఉత్సాహాన్ని నింపింది. కంపెనీ సీఈఓగా టిమ్ కుక్ తీసుకుంటోన్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో యాపిల్‌ను మరింత ఉన్నత శిఖరాల్లో నిలబెడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి