India-Afghanistan: బలపడుతున్న భారత్-ఆప్ఘని బంధం..
ఢిల్లీలో తాలిబన్ దౌత్యవేత్త నియామకానికి ఏర్పాట్లు
భారత్-ఆప్ఘనిస్థాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తా భారత్‌లో పర్యటించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య బంధం స్ట్రాంగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి తాలిబన్ దౌత్యవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఎలాంటి నియామకాలు జరగలేదు. తాజాగా బంధం బలపడటంతో దౌత్తవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దౌత్యవేత్తను నియమిస్తే భారత్‌లో తొలి నియామకం ఇదే కానుంది.
ఈనెలలో తొలి దౌత్యవేత్తను నియమిస్తుండగా.. రెండో దౌత్యవేత్త నియామకం డిసెంబర్‌లో లేదా జనవరి ప్రారంభంలో నియమించే అవకాశం ఉంది. తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించకపోయినా.. నిరంతరం మానవతా, వైద్య సాయం అందించేందుకు ముందుకొచ్చింది. జమ్మూకాశ్మీర్‌పై భారతదేశ సార్వభౌమాధికారానికి తాలిబన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
త్వరలోనే రెండు దేశాల మధ్య దౌత్య కార్యక్రమాలు పునరుద్ధరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే 16 టన్నులకు పైగా యాంటీ-వెక్టర్-బోర్న్ డిసీజ్ మందులను భారత్ విరాళంగా ఇవ్వడాన్ని తాలిబన్ ప్రతినిధి స్వాగతించారు. అవసరమైన సాయం అందించేందుకు భారత్ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని తెలిపారు.
ఈ మధ్య పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఆప్ఘనిస్థాన్‌లోని టీటీపీ శివరాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామాబాద్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఇటీవల శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యాయి.