ఇక యాపిల్ ఫోన్‌తో వీడియో కాల్ చేస్తే...
సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా దాన్ని ఎవరు వినియోగించినా వారి గోప్యతకు భంగం వాటిల్లకుండా చూసే యాపిల్... యూజర్ల గోప్యతను కాపాడేందుకు మరో అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది.;
అమెరికా దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రపంచంలోనే అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తోంది. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ రూపొందించిన ఏ ప్రొడక్ట్ లుక్ చూసినా విలాసవంతంగా.. ఖరీదైనదిగా కన్పిస్తుంది. ధర ఎక్కువైనా ఆ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసే ఐ ఫోన్లకు చాలా క్రేజ్ ఉంటుంది. వినియోగదారుల డేటాకు భద్రత కల్పించడంలో యాపిల్ ఎలాంటి రాజీ పడదు. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా దాన్ని ఎవరు వినియోగించినా వారి గోప్యతకు భంగం వాటిల్లకుండా చూస్తుంది. అంతే కాదు థర్డ్ పార్టీ యాప్‌లు కొన్ని........ ఆండ్రాయిడ్ యూజర్ల డేటాను తస్కరించడానికి యత్నిస్తుంటాయి. ప్రత్యేక అనుమతులు యూజర్ నుంచి తీసుకొని డేటా చౌర్యానికి పాల్పడుతుంటాయి. ఇలాంటి చర్యలను సమర్థంగా అడ్డుకుంటున్న యాపిల్... ఇప్పుడు యూజర్ల గోప్యతను కాపాడేందుకు మరో అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. అదే వీడియో కాల్ భద్రత. ఇటీవల నిర్వహించిన ప్రపంచవ్యాప్త డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో యాపిల్ విజన్ ప్రో అనే ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఇందులో యూజర్ గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. వీడియో కాల్ మాట్లాడే యూజర్ ముఖాన్ని థర్డ్ పార్టీ యాప్స్ సేకరించకుండా విజన్ ప్రో AR అడ్డుకోనుంది. అంటే అవతలి వ్యక్తికి వీడియో కాల్ మాట్లాడే యూజర్ అసలు ముఖానికి బదులు అదే రూపాన్ని పోలిన ప్రతీకాత్మక చిత్రం కనిపించనుంది. ప్రత్యేక పద్ధతులను ఉపయోగించి, యూజర్ ముఖ కవళికలు, చేతి సైగలు అనుకరించేలా ప్రతీకాత్మక రూపం పని చేయనుంది. Zoom, WebEx లాంటి మీటింగ్ యాప్‌లు కూడా ఈ ప్రతీకాత్మక రూపాలను సేకరించేలా రూపొందించింది. 2024 ప్రారంభం నాటికి యాపిల్ విజన్ ప్రోను అమెరికా మార్కెట్‌లోకి యాపిల్ ప్రవేశపెట్టనుంది. దీని ధర భారత నగదులో సుమారు 2 లక్షలా 88వేల 500 రూపాయలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.