Best Selling EVs : జనవరిలో ఎలక్ట్రిక్ కార్ల జాతర.. అమ్మకాల్లో దూసుకుపోతున్న టాప్-5 ఈవీలు ఇవే.

Update: 2026-02-28 13:30 GMT

Best Selling EVs :భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు నుంచి తప్పించుకోవడమే కాకుండా, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన వల్ల కస్టమర్లు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తగ్గట్టే తాజాగా విడుదలైన జనవరి 2026 సేల్స్ రిపోర్ట్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ నెలలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, ఎంజీ, మహీంద్రా కూడా గట్టి పోటీని ఇచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

టాటా నెక్సాన్ ఈవీ

ఎప్పటిలాగే ఈ జాబితాలో టాటా నెక్సాన్ ఈవీ అగ్రస్థానంలో నిలిచింది. జనవరి 2026లో ఏకంగా 3,098 యూనిట్ల అమ్మకాలతో నంబర్-1 ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించింది. ఈ కారుకు ఉన్న అద్భుతమైన రేంజ్, బలమైన బాడీ క్వాలిటీ మరియు ప్రీమియం ఫీచర్లు కస్టమర్లను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.12.49 లక్షల నుంచి టాప్ మోడల్ ధర రూ.17.49 లక్షల వరకు ఉంది. మొత్తం 13 వేరియంట్లలో లభించే ఈ కారు మధ్యతరగతి, సంపన్న వర్గాల ఫస్ట్ ఛాయిస్ అయిపోయింది.

ఎంజీ విండ్సర్ ఈవీ

లిస్ట్‌లో రెండో స్థానాన్ని ఎంజీ విండ్సర్ ఈవీ కైవసం చేసుకుంది. జనవరిలో 2,567 మంది కస్టమర్లు ఈ కారును తమ ఇంటికి తీసుకెళ్లారు. విశాలమైన కేబిన్, వినూత్నమైన డిజైన్ వల్ల ఫ్యామిలీ కార్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారింది. బ్యాటరీతో కలిపి దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.13.50 లక్షల నుంచి మొదలై రూ.18.50 లక్షల వరకు ఉంది. మొత్తం 3 వేరియంట్లలో లభించే ఈ కారు, ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ విభాగంలో దుమ్మురేపుతోంది.

టాటా హారియర్ ఈవీ

పెద్ద ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఇష్టపడే వారిని టాటా హారియర్ ఈవీ అలరిస్తోంది. మూడో స్థానంలో నిలిచిన ఈ కారు జనవరిలో 1,995 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. 2025 జూన్‌లో లాంచ్ అయినప్పటి నుంచి దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 4x4 (AWD) సామర్థ్యం, అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ కారు ప్రారంభ ధర రూ.21.49 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ మోడల్ ధర దాదాపు రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల వరకు ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈ, టాటా టియాగో ఈవీ

మహీంద్రా నుంచి వచ్చిన మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈ 1,945 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. స్టైల్ మరియు పర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ కారు ధర రూ.21.90 లక్షల నుంచి రూ.31.25 లక్షల మధ్యలో ఉంది. ఇక ఐదో స్థానంలో మధ్యతరగతి వారికి అత్యంత ఆత్మీయమైన టాటా టియాగో ఈవీ నిలిచింది. జనవరిలో 1,223 యూనిట్లు అమ్ముడయ్యాయి. తక్కువ ధరలో (రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షలు) ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వరం.

మొత్తానికి భారత రోడ్లపై ఎలక్ట్రిక్ కార్ల వేగం పెరిగింది. రేంజ్ విషయంలో ఉన్న భయాలు తగ్గి, ఛార్జింగ్ సదుపాయాలు మెరుగుపడుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News