ITR: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్.. మారిన రూల్స్ ఇవే!

ఐటీఆర్ ఫారమ్‌లలో కొత్త మార్పులు;

Update: 2025-05-11 04:00 GMT

ఆదాయపు పన్ను దాఖలుకు సమయం రానే వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. 2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌లో (మదింపు సంవత్సరం) ఐటీఆర్‌ దాఖలుకు చివరి తేదీని ప్రభుత్వం జులై 31గా నిర్ణయించింది. చివరి నిమిషంలో గందరగోళంగా పన్ను రిటర్న్‌లు ఫైల్‌ చేస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అయితే, ఈసారి ఐటీఆర్ ఫారమ్‌లలో కొన్ని కొత్త మార్పులు వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుని వీలైనంత త్వరగా ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి దాఖలుకు ఎలాంటి ధ్రువపత్రాలు సమకూర్చుకోవాలి.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుందాం..

సాధారణంగా వాడే ఫారమ్‌లు (ITR-1, ITR-4)

అంతకు ముందు, షేర్లు లేదా ఇతర పెట్టుబడులపై ఎక్కువ లాభం (దీర్ఘకాలిక మూలధన లాభం) ఉంటే ఈ ఫారమ్‌లు వీలు కల్పించేవి. కానీ ఇప్పుడు, రూ. 1.25 లక్షల వరకు లాభం ఉంటే ఈ ఫారమ్‌లను ఉపయోగించవచ్చు. అయితే, ఈ లాభంపై గతంలో ఏమైనా నష్టం ఉంటే దాన్ని కలపడానికి మాత్రం కుదరదు. మీరు వివిధ రకాలైన తగ్గింపులు (ఉదాహరణకు, పెట్టుబడులపై తగ్గింపులు) క్లెయిమ్ చేస్తే, వాటి వివరాలను మరింత స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. మీ జీతం లేదా ఇతర ఆదాయాల నుంచి టీడీఎస్ ఎంతో తెలిపే షెడ్యూల్‌లో, ఆ టీడీఎస్ ఏ సెక్షన్ కింద కట్ చేశారో కూడా చెప్పాలి.

పెట్టుబడులు, ఎక్కువ ఆదాయం ఉన్నవారి కోసం (ITR-2)

మీరు షేర్లు లేదా ఇతర ఆస్తులను అమ్మడం ద్వారా లాభం పొందితే, ఆ లాభాన్ని జులై 23, 2024కు ముందు పొందిన లాభం ఎంత, తర్వాత పొందిన లాభం ఎంత అని విడివిడిగా చూపించాలి. మీ కంపెనీ మీ వద్ద నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేస్తే దానిపై వచ్చిన నష్టాన్ని మీరు చూపించవచ్చు. కానీ, దానిపై మీకు డివిడెండ్ వస్తే, దాన్ని ఇతర ఆదాయాల కింద చూపించాలి. ఇది అక్టోబర్ 1, 2024 తర్వాత జరిగితేనే వర్తిస్తుంది. మీ మొత్తం ఆదాయం రూ.1 కోటి దాటితే, మీ ఆస్తులు, పన్ను చెల్లింపు వివరాలను మరింత వివరంగా ఇవ్వాలి.

వ్యాపారం చేసే వారి కోసం (ITR-3)

మీరు కొన్న ఆస్తిని ఎంత కాలం మీ దగ్గర ఉంచుకున్నారు అనే దానిపై కొన్ని మార్పులు చేశారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లాభాలపై పన్ను రేట్లలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఖరీదైన ఆస్తుల విలువను లెక్కించే విధానంలో (ఇండెక్సేషన్) కూడా కొన్ని మార్పులు చేశారు.

సంస్థలు, భాగస్వామ్య సంస్థల కోసం (ITR-5, ITR-6)

ITR-2లో చెప్పినట్టుగానే, మూలధన లాభాలను జులై 23, 2024కు ముందు, తర్వాత వచ్చిన వాటిని విడివిడిగా చూపించాలి. షేర్ బైబ్యాక్‌పై వచ్చే నష్టాన్ని చూపించవచ్చు, కానీ డివిడెండ్‌ను ఇతర ఆదాయాల కింద చూపించాలి. క్రూయిజ్ వ్యాపారం చేసేవారికి సంబంధించిన ఒక కొత్త సెక్షన్ (44BBC) యాడ్ అయింది. టీడీఎస్ వివరాలలో, టీడీఎస్ ఏ సెక్షన్ కింద కట్ చేశారో తప్పకుండా చెప్పాలి. ITR-6లో, వజ్రాల వ్యాపారం చేసేవారికి లాభాల లెక్కింపులో ఒక కొత్త నియమం (రూల్ 10TIA) వచ్చింది. వారి లాభం స్థూల రసీదులలో 4 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే, ఇంటి రుణంపై వచ్చే వడ్డీ తగ్గింపుల (సెక్షన్ 24(b)) వివరాలను మరింత స్పష్టంగా ఇవ్వాలి.

Tags:    

Similar News