Bank Holidays : నవంబర్ నెలలో 10రోజులు మూతపడనున్న బ్యాంకులు...కారణం ఇదే.
Bank Holidays : అక్టోబర్ నెల పండుగలు, సెలవులతో నిండిపోవడంతో బ్యాంకింగ్ పనులు చాలా వరకు ప్రభావితమయ్యాయి. ఇప్పుడు నవంబర్ 2025 నెల ప్రారంభమైనందున, బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేయవు, ఏయే ముఖ్యమైన సెలవులు ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన అధికారిక జాబితా ప్రకారం.. ఈ నెలలో సెలవుల సంఖ్య అక్టోబర్‌తో పోలిస్తే కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ, పండుగలు, వీకెండ్ సెలవులతో కలిపి మొత్తం 10 రోజుల వరకు బ్యాంకులు మూసి ఉండే అవకాశం ఉంది
నవంబర్ 2025 నెలలో పండుగలు, వీకెండ్ సెలవుల కారణంగా బ్యాంకులు కొన్ని రోజులు మూసి ఉండనున్నాయి. ఈ నెలలో పండుగలు, వీకెండ్ సెలవులతో కలిపి మొత్తం 10 రోజుల వరకు బ్యాంకులు మూసి ఉండవచ్చు. ఈ నెలలో అత్యంత ముఖ్యమైన, దేశవ్యాప్తంగా వర్తించే సెలవు నవంబర్ 5, బుధవారం. ఈ రోజున గురు నానక్ జయంతి, కార్తీక పూర్ణిమ పండుగలు ఉండటం వల్ల దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు.
నవంబర్ నెల ప్రారంభమే సెలవుతో మొదలవుతోంది. నవంబర్ 1న బెంగళూరులో కన్నడ రాజ్యోత్సవ, డెహ్రాడూన్‌లో ఇగాస్-బగ్వాల్ కారణంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. నవంబర్ 7న షిల్లాంగ్‌లో వంగాళ మహోత్సవ్ కారణంగా, నవంబర్ 8న బెంగళూరులో కనకదాస్ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే, ఈ సెలవులు ఆయా రాష్ట్రాలకే పరిమితం.
పండుగల సెలవులతో పాటు, వారాంతపు సెలవులు కూడా కలుపుకుంటే నవంబర్‌లో మొత్తం 10 రోజులు బ్యాంక్ లావాదేవీలకు అంతరాయం కలగవచ్చు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలు. ఆ తేదీలు నవంబర్ 8 (రెండవ శనివారం), నవంబర్ 22 (నాల్గవ శనివారం). ఈ నెలలో మొత్తం ఐదు ఆదివారాలు ఉన్నాయి. ఇవి కూడా బ్యాంకులకు వీక్లీ హాలిడేస్. ఆ తేదీలు నవంబర్ 2, 9, 16, 23, 30.
బ్యాంకులకు సెలవు ఉన్నంత మాత్రాన మీ ఆర్థిక లావాదేవీలు ఆగిపోవాల్సిన అవసరం లేదు. బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి చేయాల్సిన పనులకు మాత్రమే సెలవుల వల్ల అంతరాయం కలుగుతుంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు వంటి సేవలు 24 గంటలు పనిచేస్తాయి. యూపీఐ ద్వారా డబ్బు పంపడం, NEFT, IMPS ద్వారా ఫండ్స్ ట్రాన్సఫర్, బిల్ పేమెంట్స్ వంటి డిజిటల్ లావాదేవీలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి.
చాలా మందికి తమ ఈఎంఐ, రికరింగ్ డిపాజిట్ లేదా ఏదైనా పెట్టుబడి మెచ్యూరిటీ తేదీ సెలవు రోజు వస్తే ఏమవుతుందనే సందేహం ఉంటుంది. ఈ విషయంలో ఆర్‌బీఐ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మీ ఈఎంఐ లేదా ఇతర ఆర్థిక లావాదేవీల గడువు తేదీ సెలవు రోజున వస్తే, ఆ లావాదేవీ లేదా సెటిల్‌మెంట్ తరువాతి పని దినం నాడు పూర్తి అవుతుంది. సెలవు రోజున ఎలాంటి పెద్ద ఆర్థిక సెటిల్‌మెంట్లు జరగవు. అందుకే, ముఖ్యమైన పనులు ఉంటే ముందుగానే చూసుకోవడం మంచిది.