జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగు నెలల్లో అన్ని రకాల మాడళ్ల ధరలను 3 శాతం వరకు సవరించబోతున్నట్టు బెంజ్ వెల్లడించింది. దీంతో బెంజ్ కార్లు మరింత ప్రియం కానున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు దఫాలుగా తమ కార్ల ధరలు రూ.90 వేల నుంచి రూ.12.2 లక్షల వరకు పెంచుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఫారెక్స్ మార్కెట్లో కరెన్సీలు తీవ్ర ఒడిదొడుకులకు లోను కావడం వల్లనే ధరలు పెంచాల్సి వస్తుందని పేర్కొంది. తాజా నిర్ణయంతో సీ-క్లాస్ మాడల్ రూ.90 వేల వరకు, బెంజ్ మేబ్యాక్ ఎస్ 680 మాడల్ రూ.12.2 లక్షల వరకు పెరగనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ ఐయర్ తెలిపారు.
జూన్ 1న తమ వాహన ధరలను 1-2 శాతం వరకు పెంచుతున్న మెర్సిడెస్ బెంజ్.. సెప్టెంబర్ 1 నుంచి 1.5 శాతం వరకు సవరిస్తున్నది. గడిచిన నాలుగు నెలల్లో రూపాయి కరెన్సీ భారీగా పడిపోయిందని పేర్కొంది. ముఖ్యంగా యూరోతో పోలిస్తే 10 శాతం తగ్గడం వల్ల సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ ఐయర్ వెల్లడించారు.