BIGBASKET: క్విక్ ఫుడ్ డెలివరీ రంగంలోకి బిగ్‌బాస్కెట్ ఎంట్రీ
బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో 10 నిమిషాల్లో ఆహారం డెలివరీ చేసే పైలట్ ప్రాజెక్ట్;
టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ గ్రాసరీ డెలివరీ సంస్థ బిగ్‌బాస్కెట్ ఇప్పుడు క్విక్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో 10 నిమిషాల్లో ఆహారం డెలివరీ చేసే పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త సేవల ద్వారా, స్టార్‌బక్స్, క్యూమిన్ వంటి టాటా గ్రూప్ అనుబంధ సంస్థల నుంచి ఫుడ్ ఐటమ్స్‌ను వేగంగా వినియోగదారులకు చేరవేస్తోంది. అందులో కాఫీ, టీ, జ్యూస్‌లు, స్నాక్స్, మీల్ బౌల్స్, డెసర్ట్స్ వంటి పదార్థాలు ఉంటాయి.
క్యూమిన్ అంటే ఏమిటి?
2020లో ప్రారంభమైన క్యూమిన్ అనేది *ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ కు చెందిన ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్. ఇది టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ హోటళ్ల నుంచి ఆహారాన్ని డెలివరీ చేసే సేవ. క్యూమిన్ కేఫ్ ద్వారా బేకరీ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. క్విక్ ఫుడ్ డెలివరీ విభాగంలో ఇప్పటికే జెప్టో, స్విగ్గీ , బ్లింకిట్ వంటి సంస్థలు విస్తృత సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థలు 10 నిమిషాల్లో డెలివరీలను అందిస్తూ మార్కెట్ డిమాండ్‌ను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం బ్లింకిట్ వంటి సంస్థలు ఢిల్లీ –ఎన్సీఆర్, బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో 100కిపైగా కిచెన్లను ఏర్పాటు చేసి విస్తరణలో ఉన్నాయి. బిగ్‌బాస్కెట్ కూడా ఇదే దారిలో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.