BSNL : బీఎస్ఎన్ఎస్ దీపావళి ధమాకా.. కొత్త కస్టమర్లకు రూపాయికే సిమ్, 30 రోజులు ఫ్రీ ఇంటర్నెట్.
BSNL : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దీపావళి సందర్భంగా తమ వినియోగదారుల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ దివాళి బొనాంజా ఆఫర్ కింద, కొత్త కస్టమర్‌లు కేవలం రూపాయి టోకెన్ ఫీజు చెల్లించి, నెల రోజుల పాటు 4G మొబైల్ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 15 నుండి నవంబర్ 15, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, కేవైసీ రూల్స్ ప్రకారం ఫ్రీ సిమ్ కార్డు లభిస్తాయి.
ఈ కొత్త ఆఫర్‌ను ప్రారంభించిన సందర్భంగా బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఎ రాబర్ట్ జె రవి మాట్లాడుతూ.. "బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా మేక్-ఇన్-ఇండియా టెక్నాలజీతో తయారు చేసిన కొత్త 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ కలను ముందుకు తీసుకుపోతుంది. దీపావళి బొనాంజా ప్లాన్ కింద మొదటి 30 రోజుల పాటు ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఉచిత సేవలను అందించడం జరుగుతుంది. దీని ద్వారా కస్టమర్‌లు మా స్వదేశీ 4G నెట్‌వర్క్ క్వాలిటీ అనుభవించవచ్చు. మా సర్వీసు క్వాలిటీ, కవరేజ్ బీఎస్ఎన్ఎల్ పై కస్టమర్లకు ఉన్న నమ్మకం ఉచిత కాలం తర్వాత కూడా వారిని మాతో ఉంచుతుందని మేము నమ్ముతున్నాము" అని పేర్కొన్నారు.
ఈ దీపావళి బొనాంజా ప్లాన్‌ను పొందడం చాలా ఈజీ. దీని కోసం కస్టమర్‌లు తమకు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ కు వెళ్లాలి. తమతో పాటు చెల్లుబాటు అయ్యే కేవైసీ డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి. అక్కడ రూపాయి యాక్టివేషన్ ఫీజుతో కూడిన 'దివాళి బొనాంజా ప్లాన్' కావాలని అడగాలి. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, వినియోగదారులకు ఉచిత సిమ్ కార్డ్ లభిస్తుంది. ఆ తర్వాత సిమ్‌ను ఫోన్‌లో వేసి, ఇచ్చిన సూచనల ప్రకారం యాక్టివేట్ చేయాలి. సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే, వారికి 30 రోజుల పాటు ఉచిత ప్రయోజనాలు ప్రారంభమవుతాయి. బీఎస్ఎన్ఎల్ 4G ప్రాజెక్ట్ తర్వాత, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇప్పుడు 5G సేవలకు అవసరమైన టెలికాం మౌలిక సదుపాయాలను మరింత పెంచడానికి సిద్ధమవుతోంది.