Chitra Ramkrishna: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు..

Chitra Ramkrishna: రహస్య వ్యాపార విషయాలు పంచుకుని సెబీ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రా రామకృష్ణ..

Update: 2022-02-19 02:15 GMT

Chitra Ramkrishna (tv5news.in)

Chitra Ramkrishna: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హిమాలయ యోగితో రహస్య వ్యాపార విషయాలు పంచుకుని సెబీ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రా రామకృష్ణకు సీబీఐ షాకిచ్చింది. దేశం విడిచి వెళ్లొద్దంటూ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.

ఇప్పటికే పన్ను ఎగవేతకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఆమె నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టగా.. తాజాగా సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. NSEలో అక్రమాలకు సంబంధించిన పాత కేసులో భాగంగా ఆమెను శుక్రవారం ప్రశ్నించిన అధికారులు.. . ఆమెతో పాటు NSE మాజీ సీఈవో రవి నరైన్‌, మాజీ సీవోవో ఆనంద్‌ సుబ్రమణియన్‌లకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

NSEలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు 2018లోనే చిత్రా రామకృష్ణపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆనంద్‌ సుబ్రమణియన్‌ను NSE గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ఎండీ అడ్వైజర్‌గా నియమించడంలో చిత్ర అవకతవకలకు పాల్పడ్డారని ఆమెపై ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా సెబీకి ఇటీవల సంచలన విషయాలు తెలిశాయి.

హిమాలయాల్లో ఉండే ఓ ఆధ్యాత్మిక యోగి చిత్రపై ప్రభావం చూపించారని, ఆమెను పావులా ఉపయోగించుకుని.. NSEని ఆయోగి నడిపించారని సెబీ గుర్తించింది. అంతేగాక, NSEకి సంబంధించిన బిజినెస్‌ ప్రణాళికలు, బోర్డు అజెండా, ఆర్థిక అంచనాలు వంటి కీలక విషయాలను ఆయోగితో చిత్ర పంచుకున్నారని సెబీ తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించినందుకు గానూ సెబీ ఆమెకు 3 కోట్ల రూపాయల జరిమానాతో పాటు మూడేళ్ల పాటు స్టాక్‌ మార్కెట్ల నుంచి నిషేధం విధించింది.

ఈ క్రమంలోనే చిత్రా రామకృష్ణపై నమోదైన పాత కేసులపై అధికారులు మళ్లీ దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే తాజాగా సీబీఐ అధికారులు చిత్రను ప్రశ్నించి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. 2009లో NSEలో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులైన చిత్రా రామకృష్ణ.. 2013లో సీఈవోగా ప్రమోట్‌ అయ్యారు. ఆ తర్వాత 2016లో వ్యక్తిగత కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. 

Tags:    

Similar News