MG Gloster : ఎంజీ కంపెనీ షాకింగ్ నిర్ణయం.. ఆ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీకి ఇక సెలవు?
MG Gloster : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఎంజీ గ్లోస్టర్ ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది. టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావించిన ఈ కారు, ఇప్పుడు అమ్మకాలు లేక మూలన పడే పరిస్థితికి వచ్చింది. తాజా మీడియా నివేదికల ప్రకారం.. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ గ్లోస్టర్‌ను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇటీవలే జరిగిన భారత్ మోబిలిటీ ఎక్స్‌పోలో మెజస్టర్ అనే కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
గ్లోస్టర్ పతనానికి ప్రధాన కారణం దాని అమ్మకాలే అని స్పష్టమవుతోంది. గత 12 నెలల కాలంలో కేవలం 321 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే కొన్ని నెలల్లో అసలు బోణీ కూడా అవ్వలేదు, మరికొన్ని నెలల్లో సింగిల్ డిజిట్ అమ్మకాలకే పరిమితమైంది. ఫార్చ్యూనర్ వంటి దిగ్గజం ముందు గ్లోస్టర్ నిలవలేకపోయింది. దీంతో పాత మోడల్‌ను పక్కన పెట్టి, సరికొత్త హంగులతో మెజస్టర్ను తీసుకురావడం ద్వారా మార్కెట్‌ను మళ్లీ చేజిక్కించుకోవాలని ఎంజీ ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ 2026లో మెజస్టర్ లాంచ్ కానుంది, మే నెల నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.
ఎంజీ మోటార్స్ తన వ్యూహాన్ని మార్చుకుంది. గ్లోస్టర్ కంటే మెరుగైన ఫీచర్లు, మరింత భారీ రూపం, శక్తివంతమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో ఎంజీ మెజస్టర్ ను రంగంలోకి దించుతోంది. వాస్తవానికి మెజస్టర్ అనేది గ్లోస్టర్ ప్లాట్‌ఫారమ్‌పైనే తయారైనప్పటికీ, దీని డిజైన్, టెక్నాలజీ పూర్తిగా కొత్తగా ఉంటాయి. గతంలో ఈ రెండు కార్లు కలిసి అమ్ముడవుతాయని కంపెనీ చెప్పినప్పటికీ, ఇప్పుడు గ్లోస్టర్ స్థానాన్ని మెజస్టర్ భర్తీ చేయనుంది. అంటే గ్లోస్టర్ వారసుడిగా మెజస్టర్ మార్కెట్లోకి వస్తోంది.
కొత్త మెజస్టర్ కోసం ఎంజీ భారీ లక్ష్యాలను పెట్టుకుంది. ప్రతి నెలా కనీసం 1,000 యూనిట్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే ఈ కారు కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ముందుగా బుక్ చేసుకునే వారికి ప్రయారిటీ సర్వీస్‌తో పాటు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తున్నారు. జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ఏప్రిల్ 2026 నాటికి భారత రోడ్లపై ఈ కొత్త కింగ్ కనిపించబోతోంది. పాత గ్లోస్టర్ వెళ్ళిపోయినా, దానికంటే పవర్‌ఫుల్ వెర్షన్‌గా మెజస్టర్ రావడం ఎంజీ ఫ్యాన్స్‌కు తీపి కబురే.