Cipla : బరువు తగ్గించే మందు వ్యాపారంలోకి సిప్లా.. అంతర్జాతీయ దిగ్గజంతో భారీ ఒప్పందం.
Cipla : దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఒకటైన సిప్లా ఇప్పుడు బరువు తగ్గించే మందుల వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం సిప్లా, అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (ఇండియా)తో ఒక కీలకమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, సిప్లా టైప్ 2 డయాబెటిస్తో పాటు, దీర్ఘకాలిక బరువు నియంత్రణకు సంబంధించిన టిర్జెపటైడ్ ఔషధాన్ని భారతదేశంలో పంపిణీ చేయనుంది.
భారతీయ ఔషధ తయారీ సంస్థ సిప్లా, ఎలీ లిల్లీ అండ్ కంపెనీ మధ్య ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. టైప్ 2 డయాబెటిస్, దీర్ఘకాలిక బరువు నియంత్రణకు ఉపయోగించే టిర్జెపటైడ్ ఔషధాన్ని భారతదేశంలో యుర్పీక్ అనే కొత్త బ్రాండ్ పేరుతో పంపిణీ, ప్రచారం చేయడానికి సిప్లాకు హక్కులు లభించాయి.
ఎలీ లిల్లీ మార్చి 2025లోనే టిర్జెపటైడ్‌ను మౌంజారో అనే బ్రాండ్ పేరుతో భారత్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు, సిప్లా ద్వారా రెండవ బ్రాండ్‌ను (యుర్పీక్) మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. టిర్జెపటైడ్ ఔషధ లభ్యతను దేశవ్యాప్తంగా విస్తరించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఈ ఒప్పందం ప్రకారం ఎలీ లిల్లీ సంస్థ యుర్పీక్ ఔషధాన్ని తయారు చేసి సిప్లాకు సరఫరా చేస్తుంది.
యుర్పీక్ ధర, ఎలీ లిల్లీ మరొక బ్రాండ్ అయిన మౌంజారో ధరతో సమానంగా ఉంటుందని రెండు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. లిల్లీ ఇండియా అధ్యక్షుడు విన్స్‌లో టకర్ మాట్లాడుతూ.. సిప్లాతో భాగస్వామ్యం ద్వారా మౌంజారో బ్రాండ్‌కు స్థిరమైన మార్కెట్ ఉన్న నగరాలను దాటి, దేశం అంతటా ఔషధం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. భారతదేశంలో పెరుగుతున్న టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం సమస్యకు ఈ చికిత్స మరింత మందికి అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.
ఈ భారీ డీల్ వార్త బయటికి వచ్చినప్పటికీ, శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో సిప్లా షేర్లలో భారీ పతనం కనిపించింది. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం.. ట్రేడింగ్ సెషన్ ప్రారంభంలో సిప్లా షేరు రూ. 1,639.95 వద్ద ఓపెన్ అయింది. అయితే, ఇంట్రా-డే ట్రేడింగ్‌లో ఇది 3.35 శాతం తగ్గి రూ. 1,590 స్థాయికి పడిపోయింది. ఉదయం 10:15 గంటలకు, కంపెనీ షేర్ 2.87 శాతం నష్టంతో రూ. 1,598 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకుముందు రోజు ముగింపు ధర రూ. 1,645.25గా ఉంది.