వందల ఉద్యోగాల లక్ష్యం హైదరాబాద్‌లో క్లియర్‌టెలిజెన్స్

Update: 2025-04-02 11:22 GMT

గ్లోబల్ టెక్నాలజీ సంస్థ క్లియర్‌టెలిజెన్స్ తన ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్‌ను హైదరాబాద్‌లో శుక్రవారం హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భం హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశలో మరో అడుగుగా నిలిచింది.

క్లియర్‌టెలిజెన్స్ సీఈవో ఓవెన్ ఫ్రీవోల్డ్ మాట్లాడుతూ, "హైదరాబాద్ లాంటి వైబ్రెంట్ మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో మా అంతర్జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సహకారం మరియు మార్గదర్శనంతోనే ఇది సాధ్యమైంది. 50 మందితో ప్రారంభమైన ఈ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ త్వరలో వందల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. బహుళ అంతస్తుల భవన నిర్మాణం మా తదుపరి లక్ష్యం. మా కంపెనీ ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో పనిచేస్తుంది," అని అన్నారు.

కో-ఫౌండర్ & మేనేజింగ్ పార్టనర్ అనీల్ భరద్వాజ్ ఇలా అన్నారు, "రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి, హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ ప్రాజెక్టులు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ టెక్ హబ్‌లో క్లియర్‌టెలిజెన్స్ భాగస్వామిగా ఉండేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని నమ్ముతున్నాం."

ఎంఎం ఇన్ఫో టెక్నాలజీస్ ఫౌండర్ మురళి (నార్త్ కరోలినా) మాట్లాడుతూ, "క్లియర్‌టెలిజెన్స్ ఇండియాలో ఎక్కడ ప్రారంభించాలని నన్ను సంప్రదించినప్పుడు, తెలంగాణ బిడ్డగా హైదరాబాద్‌ను సిఫారసు చేశాను. వారు బెంగళూరును పరిశీలించినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన ఎకోసిస్టమ్ కారణంగా హైదరాబాద్‌నే ఎంచుకున్నారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కొత్త కంపెనీలకు అందిస్తున్న సహకారం నన్ను ఆకర్షించింది. ఈ ప్రారంభం వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని ఆశిస్తున్నాను," అని అన్నారు.

ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, "ఉగాది తర్వాత మహేశ్వరంలో 200 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ‘ఏఐ సిటీ’ నిర్మాణానికి భూమి పూజ జరుపుతాం. ఇప్పటికే పలు టెక్ దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో తెలంగాణ హబ్‌గా మారుతుంది. టెక్నాలజీ అంటే హైదరాబాద్ వైపు ప్రపంచం చూసేలా చేయడమే మా లక్ష్యం. పరిశ్రమలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం," అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన యువతను అతిపెద్ద ఆస్తిగా అభివర్ణించారు.

ఏఐ, డేటా ఇంజనీరింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో సేవలు అందించే క్లియర్‌టెలిజెన్స్ హైదరాబాద్‌ను ఎంచుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓవెన్ ఫ్రీవోల్డ్ (సీఈవో), అనీల్ భరద్వాజ్ (మేనేజింగ్ పార్టనర్), మురళి, హరికృష్ణ (డైరెక్టర్), శ్రీధర్ సుస్వరం (జీఎం & డైరెక్టర్) తదితరులు పాల్గొన్నారు

Similar News