Toyota : టయోటా కొత్త ఎస్‌యూవీ గ్లోబల్ ఎంట్రీ..అదిరిపోయే ఫీచర్లతో నేడే లాంచ్.

Update: 2026-02-10 07:45 GMT

Toyota : ప్రపంచ ప్రఖ్యాత జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా తన సరికొత్త త్రీ-రో ఎస్‌యూవీని ఈరోజే (ఫిబ్రవరి 10, 2026) ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తోంది. లాంచ్‌కు ముందే ఈ కారుకు సంబంధించిన ఇంటీరియర్ ఫోటోలు లీక్ అవ్వడంతో ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ల్యాండ్ క్రూజర్ వంటి ఖరీదైన కార్లలో ఉండే ప్రీమియం ఫీచర్లను ఈ కొత్త ఎస్‌యూవీలో టయోటా జోడించినట్లు తెలుస్తోంది. భారీ సైజు, అత్యాధునిక టెక్నాలజీతో రాబోతున్న ఈ కారు విశేషాలు ఇప్పుడు చూద్దాం.

టయోటా విడుదల చేసిన టీజర్ చిత్రాల ప్రకారం..ఈ కొత్త ఎస్‌యూవీ ఇంటీరియర్ చాలా రిచ్‌గా ఉంది. ఇందులో హారిజాంటల్ ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, లేయర్డ్ డాష్‌బోర్డ్ డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా టయోటా తన ఖరీదైన మోడల్ ల్యాండ్ క్రూజర్ LC300 నుంచి స్ఫూర్తి పొంది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్‌ను ఇందులో అమర్చింది. భారత్‌లో ఇది లాంచ్ అయితే 6-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. రెండో వరుసలో కెప్టెన్ సీట్లు ఉండటం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ ఎస్‌యూవీలో కేవలం విలాసం మాత్రమే కాదు, టెక్నాలజీ కూడా నెక్స్ట్ లెవల్‌లో ఉంది. త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ద్వారా కార్లోని ప్రయాణికులు తమకు నచ్చిన ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవచ్చు. ఇక అతిపెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ మూడవ వరుస వరకు విస్తరించి ఉండటం వల్ల లోపల చాలా విశాలంగా, కాంతివంతంగా అనిపిస్తుంది. డోర్లు, డాష్‌బోర్డ్ చుట్టూ ఉన్న యాంబియంట్ లైటింగ్ స్ట్రిప్స్ రాత్రిపూట ప్రయాణంలో కారుకు ఒక ప్రత్యేకమైన లుక్‌ని ఇస్తాయి. మ్యూజిక్ ప్రియుల కోసం ప్రీమియం సరౌండ్ సిస్టమ్‌ను కూడా టొయోటా సిద్ధం చేసింది.

కారు ఇంటీరియర్‌తో పాటు ఎక్స్‌టీరియర్ కూడా అదిరిపోయేలా ప్లాన్ చేసింది టొయోటా. ఇప్పటికే వెల్లడైన సమాచారం ప్రకారం.. కారు వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ ఉంటాయి. బాక్సీ డిజైన్, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నాతో ఇది అచ్చమైన రగ్గడ్ ఎస్‌యూవీలా కనిపిస్తుంది. ఇది పూర్తిగా కొత్త మోడలా లేక పాత మోడల్ కి అప్‌డేటా అనేది కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు. కానీ దీని సైజు చూస్తుంటే ఇది మిడ్-సైజ్ లేదా ఫుల్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దుమ్మురేపడం ఖాయమనిపిస్తోంది.

Tags:    

Similar News