Gold : భారతదేశంలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక అత్యుత్తమ పెట్టుబడి మార్గం కూడా. ముఖ్యంగా ధన త్రయోదశి, దీపావళి వంటి పండుగల సమయంలో బంగారం కొనుగోలు చేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే, పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో పెట్టుబడిదారులు ఇప్పుడు రెండు ప్రధాన మార్గాల మధ్య తికమక పడుతున్నారు. ఒకటి సంప్రదాయ ఫిజికల్ గోల్డ్ (ఆభరణాలు, నాణేలు), మరొకటి కొత్తగా ట్రెండీ అవుతున్న డిజిటల్ గోల్డ్ (ఆన్‌లైన్ బంగారం). ఈ రెండు ఆప్షన్లలో ఏది మెరుగైన రాబడిని ఇస్తుంది? దేనికి ఖర్చు తక్కువ? దేనిని సులభంగా అమ్ముకోవచ్చు? వివరంగా తెలుసుకుందాం.
ఫిజికల్ గోల్డ్ అంటే మనం కొనుగోలు చేసే ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్ లేదా గోల్డ్ బార్స్. దీనికి దానికంటూ ఒక ప్రత్యేక ఆకర్షణ, ఉపయోగం ఉంటుంది. ఫిజికల్ గోల్డ్‌ను మనం ధరించవచ్చు, బహుమతిగా ఇవ్వవచ్చు, ధర పెరిగినప్పుడు లాభం పొందవచ్చు. పెట్టుబడి కోణం నుంచి చూసినప్పుడు, ఫిజికల్ గోల్డ్‌కు కొన్ని అదనపు ఖర్చులు ఉంటాయి. తయారీ ఛార్జీలు, 3% జీఎస్టీ, భద్రత కోసం లాకర్ ఛార్జీలు వంటివి మన రాబడి పై ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా దొంగతనం అయ్యే రిస్క్ కూడా ఉంటుంది.
డిజిటల్ గోల్డ్‌ను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేస్తారు. ఇది భౌతిక రూపంలో ఉండదు, కానీ దానికి సమానమైన బంగారాన్ని కంపెనీ సురక్షితమైన లాకర్లలో భద్రపరుస్తుంది. డిజిటల్ గోల్డ్ అతి తక్కువ మొత్తంలో అంటే కేవలం రూ.10 నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనికి తయారీ ఛార్జీలు ఉండవు. కొన్న బంగారాన్ని సురక్షితమైన లాకర్లలో ఉంచుతారు. దానికి సంబంధించిన డిజిటల్ సర్టిఫికేట్ మీకు లభిస్తుంది. దీనిని 24x7 ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. కాబట్టి, చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, తక్షణమే డబ్బు కావాలనుకునే వారికి డిజిటల్ గోల్డ్ బెస్ట్.
బంగారం కొనుగోలులో అయ్యే మొత్తం ఖర్చును పోల్చి చూస్తే డిజిటల్, ఫిజికల్ గోల్డ్ మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది. డిజిటల్ గోల్డ్‌కు 3% జీఎస్టీ తప్పనిసరిగా ఉంటుంది. కొన్నిసార్లు 0.3-0.4% వరకు యాన్యువల్ ఛార్జీ కూడా పడుతుంది. అయితే ఈ ఛార్జీలు స్పష్టంగా, ముందుగానే తెలుస్తాయి. ఫిజికల్ గోల్డ్‌కు తయారీ ఛార్జీలు, జీఎస్టీ, లాకర్ ఛార్జీలు అన్నీ కలిసి చాలా ఖరీదైనదిగా మారుతుంది. అందువల్ల, చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి డిజిటల్ గోల్డ్ చాలా సులభం, చౌకగా ఉంటుంది.
మీరు ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఏది కొనుగోలు చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది. మీరు రూ.2-3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టాలనుకుంటే, నమ్మకమైన సంస్థల నుండి ఫిజికల్ గోల్డ్ బార్స్ లేదా కాయిన్స్ కొనుగోలు చేయడం లాభదాయకం కావచ్చు. మీరు రూ.100 నుంచి రూ.10,000 వరకు చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే, దాని సౌలభ్యం, లిక్విడిటీ కోసం డిజిటల్ గోల్డ్ అనువైనది.
లిక్విడిటీ అంటే మన పెట్టుబడిని త్వరగా నగదుగా మార్చుకోగల సామర్థ్యం. భద్రత అనేది పెట్టుబడికి ఉన్న రిస్క్. డిజిటల్ గోల్డ్‌ను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా తక్షణమే అమ్మి, ఆ డబ్బును నేరుగా బ్యాంకు ఖాతాలోకి తీసుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్‌ను అమ్మాలంటే, దాని స్వచ్ఛతను పరీక్షించాలి, ధర చర్చించాలి, కొన్నిసార్లు బైబ్యాక్ సమయాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి లిక్విడిటీలో డిజిటల్ గోల్డ్ ముందంజలో ఉంది.
డిజిటల్ గోల్డ్‌కు ఆడిటింగ్ జరుగుతుంది. దొంగతనం లేదా లాకర్ తాళాల గురించి పెట్టుబడిదారుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫిజికల్ గోల్డ్‌ను మీ వద్ద ఉంచుకోవడం వలన దొంగతనం, నష్టం రిస్క్ ఉంటుంది. అయితే, డిజిటల్ గోల్డ్ భద్రత మాత్రం ఆ ప్లాట్‌ఫారమ్ విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది.