నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిద్ధమైంది. 2020 నుంచి ఇప్పటి వరకు కూడా వడ్డీ రేట్లు తగ్గించని ఫెడ్.. ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్18న ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్.. వడ్డి రేట్ల తగ్గింపుకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. నవంబర్ 2024 లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నెలల ముందు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక లక్ష్యమైన రెండు శాతానికి తగ్గుతుండటం, ఆహార పదార్థాలు, వస్తువుల ధరలు దిగి రావడంతో వడ్డీరేట్లను తగ్గించాలని గత ఫెడ్ సమావేశంలో నిర్ణయించారు. ఫెడ్ ఛైర్మన్ కూడా రేట్లను తగ్గించడానికి సిద్ధంగా ఉన్నామని గత నెల ఒక అధికారిక సమావేశంలో వెల్లడించారు. లెక్కల ప్రకారం ద్రవ్యోల్బణం జులై నెలలో 2.5 శాతానికి పడిపోయింది. ఇది రెండేళ్ల క్రితం గరిష్ట స్థాయి 7.1 శాతం కంటే చాలా తక్కువ, సెంట్రల్ బ్యాంక్ 2 శాతం లక్ష్య స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఇది సానుకూల స్థితిలోనే ఉందని ఫెడ్ సీనియర్ అధికారులు తెలిపారు. మార్కెట్ వర్గాల ప్రకారం, 25 బేసిస్ పాయింట్లు లేదా 50 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించే అవకాశం ఉందని తెలుస్తుంది.