GST : ఫెస్టివల్ సీజన్‌లో జీఎస్‌టీ సంస్కరణల విజయం..రూ.6 లక్షల కోట్లతో ఆర్థిక వ్యవస్థకు ఊపు.

Update: 2025-11-03 09:00 GMT

GST : అమెరికా వంటి దేశాలు భారత్‌పై అధిక పన్నులు (50%) విధించడంతో, దేశ ఎగుమతి ఆదాయం తగ్గి ఆర్థిక వ్యవస్థ కొంత ఒత్తిడిలో పడింది. ఇలాంటి సమయంలో దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు, ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లను తగ్గించింది. దాదాపు 400 కేటగిరీల వస్తువులపై పన్ను తగ్గడంతో వాటి ధరలు తగ్గాయి. ఈ సంస్కరణల ఫలితంగా పండుగ సీజన్ మొదలవ్వగానే దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు మార్కెట్‌లకు పోటెత్తారు. ఈసారి పండుగ సీజన్ అమ్మకాలలో మునుపటి రికార్డులన్నీ బద్దలయ్యాయి.

సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 21 మధ్య (నవరాత్రి, దీపావళి పండుగల మధ్య) వినియోగదారుల ఖర్చు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 8.5% పెరిగింది. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం అమ్మకాలు రూ.6 లక్షల కోట్లకు పైగా చేరుకున్నాయి. ఇందులో ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, స్వీట్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ పన్ను తగ్గింపు వాహన కొనుగోళ్లకు భారీ ఊపునిచ్చింది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి పెద్ద కార్ల కంపెనీల నెలవారీ అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా ధంతేరస్ రోజున హ్యుందాయ్ 20% అమ్మకాల వృద్ధిని చూసింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి రుతుపవనాల కారణంగా ట్రాక్టర్లు, ఇతర వస్తువుల కొనుగోలు పెరిగింది.

పెరిగిన డిమాండ్‌ను తట్టుకోవడానికి, మారుతి సుజుకి వంటి కంపెనీలు చిన్న కార్ల తయారీని పెంచడానికి ఆదివారం కూడా ఉత్పత్తిని కొనసాగించాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థలు కూడా ఖర్చులలో మంచి వృద్ధిని చూశాయి. అయితే, నోమురా వంటి ఆర్థిక నిపుణులు ఈ అమ్మకాల పెరుగుదలను జాగ్రత్తగా విశ్లేషించాలని సూచించారు. ధరలు తగ్గుతాయని భావించి, ఆగస్టు నుంచి సెప్టెంబర్ చివరి వరకు చాలా మంది కొనుగోళ్లను వాయిదా వేశారు. ఆ డిమాండ్ ప్రస్తుతం వ్యాపారం పెరుగుదలకు కారణం కావొచ్చని వారు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, క్రోమ్టన్ వంటి కంపెనీల అధికారులు, ఈ వృద్ధి ధోరణి జనవరి తర్వాత కూడా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇది వినియోగం సరైన దిశలో పయనిస్తోందనడానికి సంకేతమని చెప్పారు.

Tags:    

Similar News