Hyundai Creta : మిడ్ సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో క్రెటా హవా.. తిరుగులేని రారాజుగా హ్యుందాయ్ సెన్సేషన్.

Update: 2026-03-17 10:30 GMT

Hyundai Creta : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ఇప్పుడు ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. 4.3 మీటర్ల నుంచి 4.7 మీటర్ల పొడవు ఉండే ఈ కేటగిరీ కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఫిబ్రవరి 2026 నాటి తాజా విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, హ్యుందాయ్ క్రెటా తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. మహింద్రా స్కార్పియో, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి ఉద్దండులు బరిలో ఉన్నప్పటికీ, క్రెటా మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ ఒక్క నెలలోనే క్రెటా 17,938 యూనిట్లు అమ్ముడై, గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 10 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

ఈ రేసులో రెండో స్థానంలో నిలిచిన మహింద్రా స్కార్పియో (Scorpio-N, Classic) కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఫిబ్రవరి నెలలో ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ 14,665 యూనిట్ల విక్రయాలతో 8 శాతం వృద్ధిని సాధించింది. అయితే, ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే మారుతి సుజుకి విక్టోరిస్ రాక. ఏకంగా 13,021 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానాన్ని దక్కించుకుని మార్కెట్ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసింది. కొత్త మోడల్ అయినప్పటికీ, మారుతికున్న బ్రాండ్ ఇమేజ్ దీనికి బాగా ప్లస్ అయింది.

అతిపెద్ద వృద్ధిని నమోదు చేసిన కారుగా టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నిలిచింది. గత ఏడాది ఫిబ్రవరిలో కేవలం 4,314 యూనిట్లు అమ్ముడైన ఈ కారు, ఈ ఏడాది ఫిబ్రవరిలో 9,359 యూనిట్ల అమ్మకాలతో ఏకంగా 117 శాతం వృద్ధిని సాధించింది. కస్టమర్లు ఇప్పుడు హైబ్రిడ్ మరియు ఇంధన సామర్థ్యం కలిగిన కార్ల వైపు ఎంతలా మొగ్గు చూపుతున్నారో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కియా సెల్టోస్ కూడా 10,308 యూనిట్ల అమ్మకాలతో 60 శాతం వృద్ధిని సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

టాటా మోటార్స్ తన హారియర్ మోడల్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఎస్‌యూవీ అమ్మకాల్లో ఏకంగా 125 శాతం పెరుగుదల కనిపించింది. ఫిబ్రవరి 2026లో 3,096 యూనిట్లు విక్రయించి, టాటా సఫారిని (1,650 యూనిట్లు) కూడా దాటేసింది. మరోవైపు, మారుతి సుజుకి గ్రాండ్ విటారా అమ్మకాలు 45 శాతం క్షీణించడం గమనార్హం. అలాగే టాటా సియెర్రా 7,100 యూనిట్లు, మహింద్రా XUV 7XO 9,112 యూనిట్ల విక్రయాలతో టాప్-10 జాబితాలో తమ స్థానాలను భద్రపరచుకున్నాయి. ఈ పోటీ చూస్తుంటే రానున్న రోజుల్లో ఎస్‌యూవీ మార్కెట్లో మరిన్ని సంచలనాలు తప్పవని అర్థమవుతోంది.

Tags:    

Similar News