Renault Duster : క్రెటా, సెల్టోస్‌లకు చుక్కలే..రూ. 10.49 లక్షలకే అదిరిపోయే ఎస్‌యూవీ లాంచ్.
Renault Duster : చాలా కాలంగా భారతీయ వాహన ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. రెనాల్ట్ ఇండియా తన ఐకానిక్ ఎస్‌యూవీ డస్టర్ కొత్త వెర్షన్‌ను నేడు అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త డస్టర్ ప్రారంభ ధరను రూ.10.49 లక్షలుగా నిర్ణయించగా, టాప్ వేరియంట్ ధర రూ.18.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. గతంలో కంటే మరింత పవర్‌ఫుల్ డిజైన్‌తో వచ్చిన ఈ కారులో స్క్వేర్ వీల్ ఆర్చెస్, బోల్డ్ ఫ్రంట్ ఫేసియా, ఎల్‌ఈడీ లైటింగ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. ఆఫ్-రోడింగ్ సామర్థ్యంతో పాటు సిటీ రోడ్లపై రాజసం ఒలకబోయడం ఈ కారు ప్రత్యేకత.
ఇంజిన్ విషయానికి వస్తే, రెనో ఈ కారును రెండు పెట్రోల్ ఆప్షన్లలో అందిస్తోంది. ఒకటి 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ కాగా, మరొకటి మరింత పవర్ఫుల్ 1.3 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. కస్టమర్ల సౌలభ్యం కోసం సిక్స్-స్పీడ్ మాన్యువల్, సివిటి, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే పర్యావరణ ప్రేమికులు ఎదురుచూస్తున్న 1.8 లీటర్ టర్బో-పెట్రోల్ హైబ్రిడ్ వేరియంట్‌ను ఈ ఏడాది చివర్లో పండుగ సీజన్ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇది కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే రాబోతోంది.
కొత్త డస్టర్‌ను కంపెనీ ఐదు వేరియంట్లలో (ఆథెంటిక్, ఇవల్యూషన్, టెక్నో, టెక్నో+, ఐకానిక్) ప్రవేశపెట్టింది. బేస్ వేరియంట్ అయిన ఆథెంటిక్ ధర రూ.10.49 లక్షలు కాగా, ఇందులో 7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, 35కి పైగా సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. ఇక మిడ్ వేరియంట్ ఇవల్యూషన్ ధర రూ.11.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రియర్‌వ్యూ కెమెరా వంటి సౌకర్యాలు ఉన్నాయి. టాప్ ఎండ్ ఐకానిక్ వేరియంట్ ఫీచర్ల పరంగా విలాసవంతంగా ఉంటుంది. ఇందులో 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీల కెమెరా, 17 రకాల అడాస్ (ADAS) ఫీచర్లు ఉండటం విశేషం.
విశేషం ఏంటంటే, ఈ కారుకున్న క్రేజ్ చూసి మార్కెట్ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా పవర్‌ఫుల్ హైబ్రిడ్ వేరియంట్ ధరలు ఇంకా ప్రకటించనప్పటికీ, 2026 సంవత్సరానికి కేటాయించిన స్టాక్ అంతా అప్పుడే అమ్ముడైపోయింది. హైబ్రిడ్ డస్టర్ కోసం కొత్త బుకింగ్స్ 2026 దీపావళి తర్వాతే ప్రారంభమవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. మెట్రో నగరాల్లో ఈ హైబ్రిడ్ మోడల్ కు 39 శాతం కంటే ఎక్కువ బుకింగ్స్ రావడం గమనార్హం. కేవలం రూ. 21 వేలతో మీరు ఈ కారును బుక్ చేసుకోవచ్చు.
రెనాల్ట్ తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కేవలం డస్టర్‌తోనే ఆగడం లేదు. రాబోయే రోజుల్లో డస్టర్ 7-సీటర్ వెర్షన్‌ను (బిగ్‌స్టర్) కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది ఈ ఏడాది ఆఖరున లేదా 2027 ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు బ్రిడ్జర్ పేరుతో ఒక సబ్-4 మీటర్ ఎస్‌యూవీని కూడా భారత్ లోనే తయారు చేసి ప్రపంచ మార్కెట్లకు పంపాలని రెనో ప్లాన్ చేస్తోంది. మొత్తానికి డస్టర్ రీ-ఎంట్రీతో ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీ తీవ్రతరం కానుంది.